Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్ల నుంచి కదలని సీరియల్ కార్పొరేటు రైతుకు వేలల్లో..
నవతెలంగాణ-దమ్మపేట
సిఫార్సు ఉన్న బడా రైతులకే పామాయిల్ మొక్కలు అందుతున్నాయి. దాంతో దరఖాస్తు చేసుకుని ఏండ్ల తరబడి పామాయిల్ మొక్కల కోసం బక్క రైతులు వేచిచూడటం తప్ప మరొక ప్రత్యామ్నాయం కనబడటం లేదు. మొక్కల సమస్యపై ఎవరికి మొరపెట్టుకున్నా ఫలితం మాత్రం శూన్యం. మూడేండ్లుగా పామాయిల్ గెలలకు అధిక ధర దక్కుతుండటంతో డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాల ప్రతికూల ప్రభావం పామాయిల్ దిగుబడులపై పడకపోవడం.. నిలకడైనఆదాయం వస్తుం డటంతో రైతులు పామాయిల్ సాగుపై మక్కువ చూపుతున్నారు. ఇటువంటి అనేక కలిసొచ్చే అంశాలతో పామాయిల్ మొక్కల కు డిమాండ్ గణనీయంగా పెరిగింది. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని కొంతమంది మాజీ, తాజా ప్రజాప్రతినిధులు, కొంతమంది పామాయిల్ రైతు సంఘం నాయకులు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు సామాన్య రైతుల నుంచి వ్యక్తమవుతున్నది. ఈ ప్రాంతంలో పామాయిల్ సాగు హక్కులు పొందిన ప్రభుత్వ రంగ టీఎస్ ఆయిల్‌ఫెడ్ యాజ మాన్యం సైతం నిబంధనలు పాటించడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దరఖాస్తు చేసుకోకపోయినప్ప టికీ సిఫార్సులున్న ధనిక రైతులకే ప్రాధాన్యతనిచ్చి మొక్కలు పంపిణీ చేస్తున్నారని సమాచారం. ఈ వ్యవహార మంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వా రావుపేట, దమ్మపేట నర్సరీలో జరుగుతోంది. దమ్మపేట మండలం పట్వారిగూడెం, జగ్గారం, పార్కలగండి ప్రాంతాల్లో వందల ఎకరాల గిరిజనుల భూములను రెండు దశాబ్దాల కాలం కౌలుకు తీసుకున్న ఒక కార్పొరేటు రైతుకు గతేడాది ఒక ప్రజాప్రతినిధి సిఫార్సుతో 10 వేలకు పైచిలుకు మొక్కలు ఇచ్చారు. ఈ ఏడాది ఇప్పటికే 5 వేలకు పైగా మొక్కలు పంపిణీ చేశారు. విషయాన్ని ఆయిల్‌ఫెడ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వకతప్పదని విస్పష్టంగా చెబుతుండటం గమనార్హం.
బాధ్యత మరిచిన అధికారులు, నాయకులూ..
ఒక ప్రభుత్వ రంగ వ్యాపార సంస్థ అయిన టీఎస్ ఆయిల్‌ఫెడ్ సీనియారిటీ ప్రాతిపదికన మొక్కలను ఇవ్వాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించింది. దరఖాస్తులు లేకపోయినా మొక్కలు ఇస్తుండటంతో మూడేండ్లుగా సీరియల్ ముందుకు కదలడం లేదు. తమకు ఎప్పుడు వస్తాయని అడిగిన రైతులకు మొక్కలు ఇచ్చేముందు సమాచారమిస్తామని ముక్తసరి జవాబు వస్తోంది. దాంతో వేచిచూడకతప్పని పరిస్థితి. ఆయిల్‌ఫెడ్ యాజమాన్యం దురాగతాలకు ప్రభుత్వ ఉద్యానవన పట్టుపరిశ్రమ శాఖ అధికారులు అండగా నిలుస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తాము మొక్కలకు దరఖాస్తు చేసుకున్నా సీనియారిటీ, పారదర్శకత పాటించకుండా అందిస్తున్నారని ఉద్యానవన శాఖకు ఫిర్యాదు చేసినా నోరుమెదపడం లేదని ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్.ఎఫ్.ఎస్.ఎమ్) పథకంలో రాష్ట్రంలో పామాయిల్ సాగు అభివృద్ధికి నిధులు అందచేస్తుంది. వీటిలో నుంచే పామాయిల్ మొక్కలకు ఇస్తున్న రాయితీని ఉద్యానవన శాఖ ధృవీకరిస్తోంది.
దొంగల్ని కాపాడుతూ...
అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం సెంట్రల్ నర్సరీలో మొక్కల దొంగతనం బహిర్గతం అయింది. దీనిలో నర్సరీలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగి పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటనపై రైతులు స్పందించే వరకు ఆయిల్‌ఫెడ్ యాజమాన్యం స్పందించపోవడం గమనార్హం. ఈ దొంగతనాన్ని రైతులు బయటపెట్టిన తర్వాత ఒక వ్యక్తి నుంచి పాత తేదీతో మొక్కల ఖరీదు కట్టించినట్టు నర్సరీలో రసీదు రాశారు. సొమ్ము కట్టించిన తర్వాత అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో మొక్కబడిగా గుర్తు తెలియని వ్యక్తులు మొక్కలు దొంగిలించారని ఫిర్యాదు చేశారు. రసీదు సొమ్ముకు రసీదుపై రాసిన తేదీకి పొంతన లేకుండా ఆయిల్‌ఫెడ్ బ్యాంకు ఖాతాలో, ఎస్ఏపీ (అకౌంటింగ్ సాఫ్ట్వేర్)లో నమోదు చేశారు. ఈ సంఘటనపై విచారణ నిర్వహించి దోషులను తేల్చడంలో యాజమాన్యం విఫలం అవడాన్ని బట్టి అక్రమాల్లో యాజమాన్యం పాత్ర సైతం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా మొక్కల పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై ప్రభుత్వం పట్టించుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులందరికీ సమ ప్రాధాన్యతనిస్తూ పారదర్శంగా మొక్కల దరఖాస్తులు నిర్వహించి మొక్కలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
పట్టు పరిశ్రమ ఉద్యానవన భద్రాద్రి జిల్లా
అధికారి మరియన్న వివరణ
సీనియార్టీ లిస్ట్ ఆయిల్‌ఫెడ్ డీఓ మెయింటెన్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టికల్చర్ ఏడీ ఉదరుకుమార్ను నియమించారు. మొక్కల్లో నాణ్యత లేకుండా ఉన్నాయని విలేకరి తెలపగా పోషణలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయనీ, వాటి నిర్వహణకు హార్టికల్చర్ నుంచి టెక్నికల్ పర్సన్‌ని విధుల్లో ఉంచినట్టు పట్టు పరిశ్రమ ఉద్యానవన భద్రాద్రి జిల్లా అధికారి మరియన్న తెలిపారు.