Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులను దెబ్బతీసిన వడగండ్ల వర్షం
- మూడ్రోజులుగా భారీ ఈదురుగాలులతో వాన
నవతెలంగాణ- విలేకరులు
మూడ్రోజులుగా కురుస్తున్న భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం.. రైతులను దెబ్బతీసింది. గతంలోనే వర్షాలకు పంటలన్నీ నష్టపోగా.. ఉన్న కొద్దిపాటి పంటలనూ ఇప్పుడు వర్షం చుట్టేసింది. మిర్చి, పత్తి తడిసింది. ఆరుతడి పంటలు తడిశాయి. గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వరంగల్ జిల్లాలో 10 మండలాల్లో 10,811 ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారు. జనగామ జిల్లాలో 461 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇందులో మొక్కజొన్న 343 ఎకరాలు, పల్లి 50 ఎకరాలు, ఉలువలు 23 ఎకరాలు, మిర్చి 30 ఎకరాలు, పొగాకు 30 ఎకరాలు నీటమునిగి 237మంది రైతులు నష్టపోయారు. మహబూబాబాద్ జిల్లాలో 317 ఎకరాల్లో మొక్కజొన్న, మిర్చి 1200 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. హన్మకొండ జిల్లాలో ఆత్మకూరు, ఐనవోలు, దామెర మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. నర్సంపేట డివిజన్లో ఖానాపూర్ మండలంలో 14 గ్రామాల్లో మొక్కజొన్న 550 ఎకరాల్లో దెబ్బతింది. 14 గ్రామాల్లో మినుము పంట 30 ఎకరాల్లో నష్టం జరిగింది. 55 ఎకరాల్లో పెసర నష్టపోయారు. గీసుగొండ మండలంలో ఆరేపల్లి గ్రామంలో మొక్కజొన్న నేలవాలింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్, కిష్టాపూర్, బాదంపల్లి, ధర్మారం, తపాళాపూర్, దేవునిగూడా తదితర గ్రామాల్లో అకాల వర్షాలకు పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. హాస్టల్ తండా గ్రామ పంచాయతీకి చెందిన రైతు పూల్సింగ్కు చెందిన నాలుగెకరాలు, బిక్కుకు చెందిన ఎనిమిదెకరాల పత్తి చేను వడగండ్ల వానకు పూర్తిగా ధ్వంసమైంది. బాదంపల్లి గ్రామ రైతు కటకం సత్తయ్యకు చెందిన సుమారు 100 కోడి పిల్లలు వడగండ్ల వర్షానికి మృత్యువాత పడగా, రేకుల షెడ్డు కూడా వర్షానికి కొట్టుకుపోయింది. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురిసింది. ఖమ్మం పట్టణంలో రోడ్లు జలమయమయ్యాయి. మయూరి సెంటర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, వైరా రోడ్డులో మోకాల్లోతు నీరు రోడ్లుపై ప్రవహించడతో వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంట తడిసింది. తెల్లవారుజామునే వర్షం పడటంతో రైతన్న ఉరుకులు పరుగులు పెట్టారు. అయినప్పటికీ మిర్చి తడిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో 1500 ఎకరాల్లో మొక్కజొన్న, 500 ఎకరాల పంట నేలకొరిగింది. మిర్చి ఆకు పూత రాలింది. అన్నపురెడ్డిపల్లిలో కల్లాల్లో ఆరబోయిన మిర్చి తడిసింది. దీంతో పంట రంగు మారే అవకాశం ఉంది.
యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో రాళ్ల వాన పడింది. చెట్లు నేలమట్టమయ్యాయి .విద్యుత్ తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భువనగిరి జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సూర్యాపేట జిల్లా మోతేలో వర్షానికి కోళ్ల షెడ్డు కూలిపోయింది. రూ.10లక్షల నష్టం వాటిల్లింది.