Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతిభవన్ ముట్టడికి ఉపాధ్యాయుల యత్నం
- అంతర్జిల్లా, స్పౌజ్ బదిలీలు చేపట్టాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన కోసం విడుదల చేసిన జీవోనెంబర్ 317పై ఆందోళనలు కొనసాగు తూనే ఉన్నాయి. ఆ జీవోను నిలిపేయాలంటూ బుధవారం ప్రగతిభవన్ ముట్టడికి ఉపాధ్యాయులు ప్రయత్నించారు. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. దీంతో పలువురు టీచర్లను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు షేక్ సలీం, టి రవికాంత్ ఆచార్య, లక్ష్మినారాయణ, రవితేజ, త్రివేణి, మహేశ్వరి, ఫాతిమా,దినేష్‌కుమార్, పరమేశ్వరి, సందీప్ డిమాండ్ చేశారు. అంతర్జిల్లా, స్పౌజ్ బదిలీలు చేపట్టాలని కోరారు. బ్లాక్‌లిస్టులో ఉంచిన 13 జిల్లాల్లో నిషేధాన్ని ఎత్తేయాలని తెలిపారు. బ్లాక్ చేసిన అన్ని ఖాళీలనూ చూపించాలనీ, భార్యాభర్తల బదిలీలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. 19 జిల్లాల్లో స్పౌజ్ కేసులను బదిలీలకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. 13 జిల్లాల్లో స్పౌజ్ కేసులను పక్కన పెట్టడం సరైంది కాదని విమర్శించారు. దీంతో అన్యాయం జరిగిన భార్యాభర్తలు వారి కుటుంబం నుంచి దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 13 జిల్లాల్లో స్పౌజ్ కేసులకు సంబంధించి బ్లాక్ చేసిన అన్ని ఖాళీలనూ చూపించాలనీ, వారు కోరిన విధంగా రీపోస్టింగ్ ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎస్ సోమేశ్‌కుమార్ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
టీచర్ల అరెస్టులకు ఉపాధ్యాయ సంఘాల ఖండన
స్పౌజ్ కేటగిరీ బదిలీలు చేపట్టాలంటూ ప్రగతిభవన్‌ను ముట్టడించిన ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి. ఈ మేరకు టీపీటీఎఫ్ అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు, డీటీఎఫ్ అధ్యక్షులు ఎం రఘుశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి, టీఎస్‌టీటీఎఫ్ అధ్యక్షులు లక్ష్మణ్‌నాయక్, శర్మన్ నాయక్ బుధవారం వేర్వేరుగా ప్రకటన విడుదల చేశారు. స్పౌజ్‌లు ఒకేజిల్లాలో పనిచేసేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు వెంటనే నిర్వహించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.