Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు నెలల్లో తొలగింపునకు చర్యలు తీసుకోవాలి: హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నివాస ప్రాంతాల మధ్యలో మద్యం దుకాణాలు ఉంటే తొలగించాలనీ, రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులపై ఆడిట్ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర సర్కార్‌ను హైకోర్టు ఆదేశిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. జనావాసాలు, హాస్టళ్లు, ఆలయాలు, ప్రార్థనామందిరాలు, పాఠశాలలకు సమీపంలో మద్యం షాపులుంటే తొలగించాలని చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. న్యాయవాది మహేందర్‌రాజు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్ రూంలు, బార్లలో మినహా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ఎక్సైజ్ రూల్స్ మేరకే మద్యం దుకాణాలు ఉండాలి. లిక్కర్ షాపులు, గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ ఆఫ్ సెల్లింగ్ బై షాప్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ లైసెన్స్ రూల్స్ విధిగా అమలు చేయాలి. రాష్ట్రంలోని మద్యం దుకాణాలపై రెండు మాసాల్లో ఆడిట్ నిర్వహించాలి. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వాటిని తొలగించి ఆమేరకు తీసుకున్న చర్యల గురించి రిజిస్ట్రార్ జనరల్‌కు నివేదిక అందజేయాలి.. అని తీర్పు చెప్పింది. మద్యం దుకాణాలు, బార్లకు లైసెన్స్‌లు మంజూరు చేయడం ప్రభుత్వ విధాన నిర్ణయం. నిబంధనలకు విరుద్దంగా మద్యం దుకాణం, బార్‌ను ఏర్పాటు చేసినట్టుగా పిటిషనర్ ఆధారాలు చూపలేదు. నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాల పర్మిట్ రూంలకు అనుమతి ఇచ్చారని అతడు ఆధారాలు చూపితే తిరిగి కోర్టుకు రావచ్చు అని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణను ముగిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది.