Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలో అధికారంలో ఉన్నబీజేపీ అమలు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలతో రైతులపై భారం పెరిగిందని విమర్శించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ముమ్మాటికీ కేంద్రమేనని ఆయన స్పష్టం చేశారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వక పోగా ఉన్న ఉద్యోగాలు ఊడబెరికిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను తమ తాబేదార్లకు కట్టబెడుతూ దేశప్రజలను బిజెపి ప్రభుత్వం ముంచుతున్నదని ఆయన ఆరోపించారు. ధనవంతులు మరింత ధనవంతులయ్యారనీ, పేదలు మరింత పేదలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించే వరకు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.