Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం విద్యానగర్ బీసీ భవన్లో నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ నీలా వెంకటేష్ అధ్యక్షతన యూనివర్సిటీ నిరుద్యోగ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా 14 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందన్నారు. అన్ని శాఖల్లో అడ్హాక్ ప్రమోషన్ల పేరుమీద ఉద్యోగాలన్నీ పూర్తి చేశారన్నారు. కొందరు ఉన్నతాధికారులు డైరెక్టు రిక్రూట్మెంట్ లెక్కించడంలో అన్యాయం చేస్తున్నారన్నారు. బ్యాంకులు, రైల్వేలు, ఇతర ప్రభుత్వ రంగసంస్థల్లో 16 లక్షలు ఖాళీలు ఉన్నా కేంద్రప్రభుత్వం వాటిని భర్తీ చేయడం లేదని విమర్శించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కష్ణ, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, కట్ట బబ్లు గౌడ్, ప్రభాకర్, పి. బ్రహ్మయ్య, జి. రాజ్యలక్ష్మి, వెంకటేష్ పాల్గొన్నారు.