Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొవిడ్ రూల్స్ తప్పక పాటించాల్సిందే
-మూడు కమిషనరేట్ల పరిధిలో 32 వేలకుపైగా కేసుల నమోదు
నవతెలంగాణ-సిటీబ్యూరో/బాలానగర్
కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్ రూల్స్ తప్పక పాటించాల్సిందేనని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రూల్స్ ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వైరస్ రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్నా అధికమవుతున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నట్టు పోలీసులు గుర్తిస్తున్నారు. మాస్కులు దగ్గర ఉన్నా కొందరు జేబులో పెట్టుకుంటుండగా, మరికొందరు దవడకు పెట్టుకుంటున్నారు. ఇంకొందరైతే మాస్క్‌లు లేకుండానే రోడ్లపై సంచరిస్తున్నారు. దాంతో పోలీసులు మాస్క్‌లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ధరించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో జనవరి ఫస్టు నుంచి 12 తేదీ వరకు జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో మాస్కు ధరించని వారిపై కేసులను నమోదు చేశారు. హైదరాబాద్‌లో దాదాపు 16,800 కేసులు నమోదు కాగా, రాచకొండలో దాదాపు 8000, సైబరాబాద్‌లో 8100 కేసులను నమోదు చేశారు. కేవలం 12 రోజుల్లోనే 32,900 కొవిడ్ రూల్స్ ఉల్లంఘన కేసులు నమోదు చేసిన పోలీసులు ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధించారు. కొవిడ్ నియమాలు పాటించాలని, తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సైబరాబాద్ సీపీ సీ్టఫన్ రవీంద్ర, రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మాస్క్‌లు ధరించని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ...
కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో బాలానగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఐ వహిదుద్దీన్ ఆదేశాల మేరకు ఎస్ఐ. రమేష్, ఏఎస్ఐ. మణ్యం, కానిస్టేబుల్ శ్రీనివాస్‌లు గురువారం రాజు కాలనీ, వినాయకనగర్, పలు కాలనీలలో మాస్కులు ధరించకుండా జనంలో తిరుగుతున్న వారిని గుర్తించి రూ. 1000 చొప్పున జరిమానా విధించారు. కొవిడ్ రూల్స్ ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌లోని సెక్షన్ 51 కింద కేసులు నమోదు చేస్తామని బాలానగర్ సీఐ హెచ్చరించారు.