Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్వీన్‌కాలనీ, హైదర్‌నగర్, వివేకానందనగర్, కూకట్పల్లి డివిజన్ (పార్ట్) డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై, పెండింగ్ పనుల స్థితిగతులపై స్థానిక ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లతో కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ మమతతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు సహకరించాలన్నారు. వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక స్పృహతో పని చేయాలన్నారు. డివిజన్ల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించి మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని వేరేవాళ్లకు అప్పగించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కనీస మౌలిక వసతుల కల్పించాలన్నారు. సమీక్షా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి రంగారావు, దొడ్ల వెంకటేష్‌గౌడ్, నార్నే శ్రీనివాస్‌రావు, కూకట్పల్లి ఎమ్మార్వో గోవర్ధన్, కూకట్పల్లి డీసీ రవీందర్, ఎస్ఈ చిన్నారెడ్డి, డీఈ సత్యనారాయణ, ఏఈ సుభాష్, రాజీవ్, టౌన్‌ప్లానింగ్ జోన్ ఏసీపీ రఘునందన్, ఇరిగేషన్ ఏఈ విశ్వం తదితరులు పాల్గొన్నారు.