Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్యనారాయణరెడ్డి గుండెపోటుతో మృతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ పరీక్షల విభాగం (డీజీఈ) సంచాలకులు అలుగుబెల్లి సత్యనారాయణరెడ్డి (56) గురువారం రాత్రి 9.30 గంటలకు గుండెపోటుతో మరణించారు. గురువారం విధులకు హాజరైన ఆయన సాయంత్రం వరకు కార్యాలయంలోనే ఉన్నారు. ఇంటికెళ్లిన తర్వాత గుండెలో నొప్పి రావడంతో ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఆయన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులుగా 2019, డిసెంబర్ 31న సత్యనారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్, కృష్ణ, మెదక్ జిల్లాల డీఈవోగా పనిచేశారు. 2012లో ఏర్పాటైన మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులుగా విధులు నిర్వహించారు. కొంతకాలం తెలుగు అకాడమి సంచాలకులుగా కొనసాగారు. పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులుగా, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా, తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం సంచాలకులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తి. సత్యనారాయణరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి ఆయన వరుసకు సోదరుడు.
పలువురి సంతాపం...
సత్యనారాయణరెడ్డి మరణం పట్ల పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన సంతాపం ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖలో మంచి అధికారిని కోల్పోయామని తెలిపారు. ఏ బాధ్యత అప్పగించినా ఎంతో ఓపికతో, చిరునవ్వుతో నిర్వహించే వారని వివరించారు.సత్యనారాయణరెడ్డి మరణం పట్ల టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి, పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు రాజభాను చంద్రప్రకాశ్,టీపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె రమణ, మైస శ్రీనివాసులు,టీఎస్టీయూ అధ్యక్షులు ఎండీ అబ్దుల్లా, తెలంగాణ ఉద్యోగుల సంఘం పాఠశాల విద్యాశాఖ విభాగం అధ్యక్షులు ఆర్ సంతోష్కీర్తి, టీపీఏ అధ్యక్షు లు నాగటి నారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్ పద్మారెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శుక్రవారం సత్యనారాయణరెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.