Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా సమస్యలు పరిష్కరించండి
- ఎమ్మెల్సీ పల్లాకు టీఎస్జీహెచ్ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 317 నిబంధనలకు విరుద్ధంగా ప్రధానోపాధ్యాయుల కేటాయింపులు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎస్జీహెచ్ఎంఏ) విమర్శించింది. ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిని గురువారం హైదరాబాద్లో ఆ సంఘం అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజగంగారెడ్డి, కోశాధికారి బి తుకారాం కలిసి వినతిపత్రం సమర్పించారు. వివిధ జిల్లాల్లో జోన్, మల్టీ జోన్లలో క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయించిన తర్వాత కేటాయింపుల్లో అదే చూపించాలని కోరారు. సంగారెడ్డి జిల్లాలో 122 హెచ్ఎం పోస్టులున్నాయని వివరించారు. ప్రస్తుతం 138 మంది పనిచేస్తున్నారని తెలిపారు. మిగిలిన 16 మందిని ఉమ్మడి మెదక్ పరిధిలోనే పోస్టింగ్లు ఇవ్వాలని సూచించారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా 40 మందిని మల్టీ జోన్-1కు కేటాయించారని వివరించారు. కేవలం 98 మంది ప్రధానోపాధ్యాయులను మాత్రమే సంగారెడ్డికి కేటాయించారని తెలిపారు. దీనివల్ల 24 మంది ప్రధానోపాధ్యాయులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జనగాం జిల్లా నుంచి 18 మందిని మల్టీ జోన్-1కు కేటాయించారని వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 16 మంది ప్రధానోపాధ్యాయులను మల్టీజోన్-2కు కేటాయించారని తెలిపారు. దీనివల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్యాడర్ స్ట్రెంత్ 34 మంది ప్రధానోపాధ్యాయులు తగ్గిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా క్యాడర్ స్ట్రెంత్ ఆధారంగా ప్రధానోపాధ్యాయులను కేటాయించాలని సూచించారు. సీఎస్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పల్లా రాజేశ్వర్రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు.