Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రో, ఎరువుల భారాలతో రైతుల నడ్డి విరిచిన మోడీ సర్కారు
- బండీ.. కేసీఆర్‌ను టచ్‌చేస్తే ప్రజలు ఉరికించి కొడ్తరు : మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించేదాకా పోరాడుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు వి. గంగాధర్ గౌడ్, ఎల్. రమణ, దండే విఠల్, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ భారాలతో రైతులు ఇబ్బందిపడుతున్న తరుణంలో మళ్లీ కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి వారి నడ్డి విరిచిందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలే ఈ దేశాన్ని ఎక్కువ కాలం పాలించాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వల్ల రైతులకు అన్యాయమే జరిగిందని చెప్పారు. రైతు నాయకులుగా ముద్రపడ్డ దేవీలాల్, చరణ్‌సింగ్‌ల కంటే ఎక్కువగా రైతు సంక్షేమం కోసం కేసీఆర్కృషి చేస్తున్నారన్నారు. ఇదంతా మరిచి బీజేపీ, కాంగ్రెస్ నేతలు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ రైతాంగ వ్యతిరేక విధానాలపై కేసీఆర్ ఉద్యమానికి నడుం బిగించారన్నారు. ఎరువుల ధరలను తగ్గించడం, ఇతర అంశాలపై ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీ నేతలు సిగ్గు లేకుండా ఎరువుల ధరలు పెంచడాన్ని సమర్ధించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని మోడీని కోరి ఐదేండ్లు అవుతున్నా కేంద్రం చప్పుడు చేయడం లేదన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్టే చేసి వేరే రూపం లో కేంద్రం రైతులను ఇబ్బంది పెడుతున్నదని విమర్శించారు. టీడీపీలో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టిన రేవంత్‌రెడ్డినే ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షులు పొగుడుతున్నారని విమర్శించారు. శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ను ఎండబెట్టింది కాంగ్రెస్ పాలన కాదా? కరెంటు సరిగా ఇచ్చారా? ప్రాజెక్టుల కింద నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో బోర్ల మోటార్లు నిత్యం కాలిపోయేయనీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. పరిశ్రమలకు కరెంటు సరిగా ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందిరాపార్కు ధర్నాలో రేవంత్ పాల్గొనలేదా? అని ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయం సర్వనాశనం కావడానికి కాంగ్రెస్ బీజేపీ విధానాలే కారణమని విమర్శించారు. దమ్ముంటే తమ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఏం చేశారో ఆయా పార్టీల నేతలు వివరాలు ఇవ్వాలనీ, అప్పుడే చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌ను టచ్‌చేస్తే ప్రజలు బీజేపీ నేతలను ఉరికించి కొడతారన్నారు.