Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా బారిన పడినా పట్టించుకోని వైనం
- యాజమాన్యంపై అధికారులు, స్థానికుల ఆగ్రహం
నవతెలంగాణ-కాజీపేట
తమ సమస్యలు పరిష్కరించాలని, కనీస వసతులు కల్పించాలని, ఫీజుల దోపిడీ నుంచి కాపాడాలని సెయింట్ ఆన్స్ నర్సింగ్ కళాశాల విద్యార్డులు డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ జిల్లా కాజీపేట్ ఫాతిమానగర్‌లోని కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. కళాశాలలో తెలుగు రాష్ట్రాలతో పాటుగా అస్సాం, పంజాబ్, కేరళ, మహారాష్ట్ర, మేఘాలయ, తమిళనాడుకు చెందిన సుమారు 350మంది విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. వీరికి కళాశాలలో తరగతులు నిర్వహించి..క్యాన్సర్ ఆస్పత్రిలో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. కళాశాల యాజమాన్యం తమ నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తోందని తెలిపారు. హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ఆహారం కూడా సరిగా పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. హాస్టల్ ఫీజును 2500 నుంచి రూ.3500కు పెంచారని, శుభ్రంగా ఉంచాలని అడిగితే తిడుతున్నారని అన్నారు. కళాశాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వెళ్లినా రూ.300-500ఫైన్ పేరుతో వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు కరోనా బారిన పడినా పట్టించుకోవడం లేదన్నారు. కరోనా చికిత్స చేయించుకునే విద్యార్థుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను చూడటానికి వచ్చిన తల్లితండ్రులును నానామాటలు తిట్టి వెనక్కి పంపిస్తున్నారని వాపోయారు. ఈ సందర్భంగా కళాశాలను, హాస్టల్‌ను, ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ అధికారులు, పోలీసులు తనిఖీ చేశారు. అనంతరం డిప్యూటీ సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకృష్ణారావు విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కళాశాల యాజమాన్యం విద్యార్థులకు సరైన భోజన సదుపాయం కల్పించడం లేదని, విద్యార్థులు తింటున్న ఆహారాన్ని, హాస్టల్, ఆస్పత్రిలో వసతులను తనిఖీ చేయగా నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో నోటీసులు జారీ చేసినట్టు ఆఫీసర్ తెలిపారు. విద్యార్థులకు స్థానిక దర్గా పీహెచ్సీలో హిమబిందు ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వచ్చిన వారికి మెరుగైన వైద్య అందిస్తామన్నారు.
కళాశాల ప్రిన్సిపల్ ఆరోగ్య మేరీ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించి, పూర్తిస్థాయిలో మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ 15 రోజుల్లో పరిష్కరిస్తామని విద్యార్థులకు లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.