Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు దశరథ్నాయక్
నవతెలంగాణ-మిర్యాలగూడ
రాష్ట్రపతి ఉత్తర్వుల సాకు చూపి ఉద్యోగ ఉపాధ్యాయులను కొత్త జిల్లాల్లో కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 317 శాపంగా మారిందని బంజారా ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరథ నాయక్ అన్నారు. బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అసంబద్ధ, అసంపూర్తి జీఓతో ఇప్పటికే పది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు మృతిచెందారని, వేలాది మంది ఉద్యోగులు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యి మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. తక్షణం జీఓకు సవరణ తెచ్చి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీటీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ.. పుట్టి, పెరిగిన ప్రకారం స్థానికత నిర్ధారణ జరుగుతుందని, ఇష్టానుసారంగా బదిలీ చేయడం తగదన్నారు. క్యాడర్ సీనియారిటీ తీసుకోవడం వల్ల సీనియర్ ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాడి రాజు మాట్లాడుతూ.. రోస్టర్ విధానం అమలు పరచకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం వాటిని అమలు పరిచే విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ.. ఐక్యంగా ఉండి ఉద్యమించడం ద్వారానే హక్కులను సాధించుకోవచ్చన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురి చేయడం తగదని ఎస్సీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్ అన్నారు. ఉద్యోగ సంఘాలు పాలక పక్షాలకు తొత్తులుగా మారడం తగదని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా కార్యదర్శి పరంగి రాము అన్నారు. బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ రాపోలు పరమేశ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రయోజనాలను ప్రభుత్వం కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.