Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాకవి జయరాజ్, విజ్ఞాన దర్శిని
రాష్ట్ర అధ్యక్షుడు రమేష్
- గిరిజనులకు దుప్పట్లు పంపిణీ
నవతెలంగాణ-కెరమెరి
గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటూనే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ప్రజాకవి, రచయిత జయరాజ్, విజ్ఞానదర్శిని రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ అన్నారు. కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పోరు గ్రామాలైన జోడేఘాట్, బాబేఝరి, చిన్నుగూడ, కొలాంగూడ, పాట్నాపూర్ గ్రామాల్లో విజ్ఞాన దర్శిని, శోధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ముందుగా కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి, సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. భీం మనుమరాలు సోంబాయిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ గిరిజనుల జీవితాలు మారలేదన్నారు. ప్రభుత్వ పథకాలు గిరిజన ప్రజలకు అందడం లేదన్నారు. అభివృద్ధి సాధించాలంటే తప్పనిసరిగా విద్యాభివృద్ధి జరగాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ ప్రజల జీవన పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రజలను చైతన్యవంతులను చేసి అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని, కుమురంభీం నడయాడిన గడ్డ ఇంకా వెనుకబడి ఉండటం విచారకరమన్నారు. విద్యార్థులు చిన్నప్పట్నుండి శాస్త్రీయ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఏ విషయాన్నీ గుడ్డిగా నమ్మకూడదని, ప్రతి దాన్నీ లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయించుకోవాలన్నారు. ఆదివాసుల్లో నేటికీ మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయని, విద్యార్థులు తల్లిదండ్రులను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో మోదుగుపూలు ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు, విజ్ఞాన దర్శిని ప్రతినిధులు అరుణ్‌కుమార్, శోభ, డీవైఎఫ్ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు విప్లవ్, జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తిక్, జిల్లా అధ్యక్షుడు బోర్కుటే శ్యామ్‌రావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, టీఏజీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొరంగే మాలశ్రీ, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపధ్యక్షుడు సతీష్, మాచర్ల ఆనంద్, డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం రాజ్‌కుమార్, ఉపాధ్యక్షుడు దుర్గం పవన్‌కుమార్, దుర్గం నిఖిల్, జిల్లానాయకులు టికానంద్, ముచ్చినేని పోశన్న, రాము పాల్గొన్నారు.