Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
- పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి
- మీడియాతో మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితుల దారుణంగా తయారైందని ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి చెప్పారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి అన్నదాతలపై మరింత భారం మోపిందని విమర్శించారు. పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మూడు రోజులపాటు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కొనసాగిన ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్, చెరుకు రైతుల జాతీయ సమావేశాలు విజయవంతంగా బుధవారం ముగిశాయి. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్లోని ఎస్వీవీకేలో తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్తో కలిసి జూలకంటి విలేకర్లతో మాట్లాడారు. సమావేశాల జయప్రదానికి సహకరించిన వారికీ, ఆర్థిక, హార్థిక సహకారం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. మూడు సాగు చట్టాల కోసం ఏడాదికాలంగా పోరాడి రైతులు ఆ చట్టాలను వెనక్కి కొట్టారని అభినందనలు తెలిపారు. పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టం సాధించేందుకు జాతీయ సమావేశాల్లో కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని తీర్మానించినట్టు తెలిపారు. ఈనెల 19న కార్మిక, కర్షక ఐక్యతా దినాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 23,24న దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు ఏఐకేఎస్ మద్దతు తెలుపుతున్నదని ప్రకటించారు. దేశంలో చెరుకు రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో వారు అప్పులపాలై, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ మిర్చి, పత్తి, వడ్లు పండించిన రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నట్టు తెలిపారు. మిర్చికి తామర తెగుళ్లు వచ్చి పంటపూర్తిగా చేతికందకుండాపోయిం దని ఆవేదన వ్యక్తం చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు మిర్చి పంట దెబ్బతిన్నాక ప్రభుత్వం ఇప్పుడు శాస్త్రవేత్తలను పంపించి పరిశీలన చేయిస్తున్నదని చెప్పారు. ఆ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ ఎకరాకు లక్ష రూపాయల నష్టపరిహారం ఇచ్చేలా కేంద్రంపై టీఆర్ఎస్ సర్కారు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న పత్తి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం...కొనకుండా చేతులేత్తేయడంతో ప్రయివేటు వ్యాపారులు అగ్గువకు కొన్నారనీ, అదే వ్యాపారులైతే సీసీఐకి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని చెప్పారు. వ్యాపారులు, సీసీఐ అధికారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. వరి ధాన్యం విషయంలో టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.