Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కృష్ణా జలాల నుంచి అదనంగా 45 టీఎంసీల వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) చైర్మెన్‌ను సాగునీటిపారుదల, ఆయకట్టు శాఖ ఉన్నతాధికారులు కోరారు. ఈ మేరకు ఆయా అంశాలపై గురువారం ఆ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి. మురళీధర్ ప్రత్యేకంగా మూడు లేఖలు రాశారు. పోలవరం ద్వారా 80 టీఎంసీలు తరలిస్తున్నారనీ, రాష్ట్రానికి అదనంగా కృష్ణాజలాలు సరఫరా చేయాలని కోరారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువల పథకాలపై ఆంధ్రప్రదేశ్‌కు అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రతిపాదించిన 13 ఎత్తిపోతల పథకాలపై అభ్యంతరాలు సరికాదని వ్యాఖ్యానించారు. రూ. 47 వేల కోట్లతో కృష్ణానదీపై ఏపీ ప్రాజెక్టులు చేపట్టిందనీ, ఆ కొత్త ప్రాజెక్టులు, విస్తరణ పనులు ఆపాలని కోరారు. శ్రీశైలం నుంచి ఏపీకి 34 టీఎంసీలకు మించి వాడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, ఔట్లెట్ల వద్ద సెన్సార్లు బిగించి, నీటి వినియోగం పూర్తిగా లెక్కించాలని సూచించారు. వాటాను ఉపయోగించుకునేలా రాజోలిబండ మళ్లింపు పనులు సైతం జరగాలని వివరించారు. తాము రాసిన మూడు లేఖలపై స్పందించాలని చైర్మెన్‌ను కోరారు. ఈ మేరకు లేఖలను మీడియాకు విడుదల చేశారు.