Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకుంటే '610' తరహా ఉద్యమం
- బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల రాజకీయక్రీడలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు బలి
- టీఎన్జీఓ,టీజీఓ, పీఆర్టీయూ బాధ్యత వహించాలి : టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నష్టదాయకంగా ఉన్న జీవో 317పై రాష్ట్ర సర్కారు వెనక్కి తగ్గాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ సూచించారు. లేదంటే జీవో 610పై జరిగిన ఉద్యమ తరహాలోనే మరొకటి పుట్టుకొస్తుందనీ, అది టీఆర్ఎస్ సర్కారుకే ప్రమాదకరమని హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'జీవో నెంబర్ 317ను సవరించాలి.. ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీల్లో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలి' అనే అంశంపై సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..317 జీవోలో లోపాలకు టీఎన్జీవో, టీజీఓ, పీఆర్టీయూ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆ జీవోను జారీ చేసినప్పుడే జరగబోయే నష్టాన్ని టీఎస్‌యూటీఎఫ్ ఎత్తిచూపిందనీ, అయినా రాష్ట్ర సర్కారు గుడ్డిగా ముందుకెళ్లిందని విమర్శించారు. ఇప్పుడు దాని ప్రభావం 40 వేల మందికిపైగా ఉద్యోగులపై పడిందని వివరించారు. అంగన్వాడీ సూపర్వైజర్లకు, మున్సిపల్ ఉద్యోగులను కూడా జోనల్ పరిధిలోకి తెచ్చి బదిలీ చేయడం అన్యాయమన్నారు. స్పౌస్‌కు సంబంధించి ఇంకా 2,500 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 317 విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత తప్పుందో కేంద్రానిదీ అంతేఉందనీ, ఇదే విషయంపై ఇప్పుడు బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికత ఆధారంగా బదిలీలు జరగాలని ఆకాంక్షిం చారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నర్సింహ మాట్లాడుతూ..ఈ జీవో వల్ల స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీని యార్టీ ప్రకారం బదిలీలు జరిగాయని సర్కారు చెబుతున్నప్పటికీ అందులో నూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని విమర్శించారు. 317 జీవో రద్దు చేసేదాకా జరిగే పోరాటానికి ఏఐటీయూసీ మద్దతు ఉంటుందని తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ..ఉపాధ్యాయుల తర్వాత ఈ జీవో ప్రభావం ఎక్కువగా చూపింది వైద్యారోగ్య శాఖపైనేనని చెప్పారు. ఆ జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్, ఎస్వీరమ, ఉపాధ్యక్షులు పి.విజయలక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కూరపాటి రమేశ్, సోమన్న, తదితరులు పాల్గొన్నారు.