Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రార్రో రార్రి..
ఉరికిరార్రి...
గుత్పలు పట్టుర్రి....
మట్టి గుండెల పౌరుషం చూపిద్దాం!
పల్లె ఎదపై బండ రాక్షసిగా కూసున్న వెట్టి పీఠాన్ని పెకిలిద్దాం!!
పేదల బతుకుమీద రాచపుండై రక్తం చూస్తున్న రజాకార్లని తరిమేద్దాం!!!
ఉరికి రార్రి....
ఊరిని సుట్టుముట్టిన శతృవుల్ని తగులబెడ్దాం!...
చీకటిలో గ్రామ నడిబొడ్డున బుర్జుపై ఉన్న నగారామోగించి, చీకటి తోడేళ్లై ఊరి మీదపడ్డ రజాకార్ల గుంపును గమనించి.. గ్రామ రక్షక దళ సభ్యులైన మోటు పోషాలు, రాములు, బలిజె నాగయ్య చేసిన గాండ్రింపులివి.
నేటి సిద్దిపేట జిల్లా, దూల్మిట్ట మండలంలోని బైరాన్‌పల్లిని నిజాం రజాకార్లు చట్టుముట్టిన సందర్భమది.
నెలల వ్యవధిలో... అప్పటికే ఈ గ్రామంపై పలుమార్లు దాడిచేసి... సంఘం చేతిలో ఓటమి చవిచూసిన దొరమూకలు... ఈ సారి భారీ పథకంతో వచ్చిపడ్డాయి. ఆధునిక ఆయుధాలు, వందల సంఖ్యలో సైన్యం, చుట్టు ముట్టు గ్రామాలకు మేల్కొలుపులా నిలిచిన బురుజును ధ్వంసం చేసే లక్ష్యంతో... తోపుల (ఫిరంగుల)తో సహా ఊరికి చేరింది రజాకార్ల దండు. కొమురయ్య బలిదానం అనంతరం... పల్లె పల్లెన సంఘం కార్యకలాపాలు విస్తరించిన నేపథ్యంలో... బైరాన్‌పల్లి సైతం ఓ ధీర పోరాట కేంద్రంగా గుర్తింపు పొందింది. తనకు తాను రక్షించుకుంటూనే చుట్టూ ఉన్న గ్రామాలకూ చైతన్య దీప్తిగా నిలిచింది. సాయుధ దళాలకు కేంద్రం బైరాన్‌పల్లి. దోపిడీబాటలో నిజాం రజాకార్లకు పరికిముళ్ల కంపగా తోచిన ఆ బైరాన్‌పల్లి అడ్డుతొలగించుకునేందుకే గ్రామంపై ఈ వ్యూహాత్మకదాడి.
ముందుగా 1948 మార్చిలో... 60 మందితో దాడికి దిగిన రజాకార్లు జనంచేతిలో ఓటమితో పారిపోయారు. 2వ సారి 80 మందితో, 3వ సారి 200ల మందితో దాడి చేశారు. ప్రజాదండు ఎదురు తిరగడంతో.. 5గురు రజాకార్లు ప్రాణం కోల్పోయారు. మిగతావారు భయంతో కాలికి పని చెప్పి బతుకు జీవుడా అనుకుంటూ పారిపోయారు. ఈ పదే పదే ఓటములు రజాకార్లను ఎక్కిరించాయి, ఏడిపించాయి, వారికోపాన్ని మరింత పెంచాయి. ఎలాగైనా ఈ ఊరు అంతుతేల్చాని నిర్ణయానికొచ్చేలా చేశాయి. అందులో భాగంగానే అర్థరాత్రి దాటాక.. ఊరుపై మరోసారి దాడికి దిగింది రజాకార్ సైన్యం. ఇలాంటి దాడుల్ని ముందుగానే ఊహించిన ప్రజలు.... చాలా కాలం క్రితమే ఊరి బురుజును సమర్థంగా వినియోగించుకునేలా వ్యూహాలు అమలు చేశారు. బురుజుపై నగారా ఏర్పాటు చేశారు. అది మోగిందంటేచాలు చూట్టురా పదిపదిహేను కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల జనం అప్రమత్తమయ్యేవారు. పిల్లా, జెల్లా, ముసలి, ముతక అడవులకు చేరేవారు... యువత ఆయుధాలందుకుని శత్రువును ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యేవారు. ధూల్మిట్టకు చెందిన దుబ్బూరి రామిరెడ్డి నేతృత్వంలో 31 మందితో ఏర్పడ్డ గ్రామ రక్షక దళాలతో పాటు.... ఈ ప్రాంతాలో ఉద్యమంనడిపే ముకుందరెడ్డి, గట్టుపల్లి మురళీధర్‌రావు, చారీ, సంగప్ప దళాలు తరచూ ఈ గ్రామానికి వస్తూ పోతూ ఉండేవి. 1948 ఆగస్టు 27న ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా... తాజాగా ఊరిపై పడ్డారు నిజాం రజాకార్లు. ఇలాంటి ముప్పు ఉందని ముందునుంచే అనుమానిస్తున్న చారీ, సంగప్ప దళాలు ఓ దేవాలయంలో ఉన్నప్పటికీ... శత్రు సైన్యం ఊరు చేరే వరకు వారి కదలికల్ని గమనించలేకపోయాయి.
ఆలస్యంగా గమనించినా బుర్జుపై నగారా మోగిన వెంటనే ప్రజలు వడిసెలలు, గుత్పలు, కర్రలు, బరిసెలు, బర్మార్లతో శత్రువును ఎదిరించారు. కానీ, ఆధునిక ఆయుధాలతో రజాకార్లు పై చేయి సాధించారు. ఒక్కరొక్కరు ఒరుగుతున్నా... జనమంతా వీరత్వం ప్రదర్శిస్తూ తలపడ్డారు. దేవాలయంలో ఉన్న దళాలు 2 గంటలపాటు భీకర పోరాటం చేశాయి. కాని అప్పటికే పరిస్థితి చేయిదాటింది. శత్రువులదే పై చేయి అయింది. తోపులతో బుర్జును పేల్చగా రక్షణగా ఉన్న పోచయ్య, రామయ్య కన్నుమూశారు. బురుజులో ఉన్న 20 మందికి పైగా యువకుల్ని ఏమీ చేయమనే హామీతో కిందికి రప్పించిన రజాకార్ సైన్యం.. వారందరిని వరసగా నిలబెట్టి కాల్చి చంపింది. అనంతరం ఊరిపై పడి దొరికిన వాళ్లను దొరికినట్టు మరో 82 మందిని జంటలుగా కట్టేసి కాల్చి చంపేసింది. ఒక్కొకరిని చంపితే తూటాలు వృధా అవుతాయని ఇద్దరుముగ్గురిని కలిపి కట్టేసి కాల్చారంటేనే వారి కౄరత్వం ఎలాంటిదో తెలుస్తుంది. ఈ దాడి.. ఆ గ్రామంలోని ప్రతి ఇంటినీ శోకంలో ముంచింది. ఇంటికి ఒక్కరో, ఇద్దరో ప్రాణం కోల్పోయారు. మొత్తంగా ఒకేరోజు 106 మంది వీరులు.. రజాకార్ల చేతిలో అమరులయ్యారు. అంతేకాదు ఆ శవాల కుప్పల వద్దనే... మహిళల్ని బట్టలిప్పించి బతకమ్మ లాడించి పైశాచిక ఆనందం పొందిన ముష్కరమూక... దాదాపు గ్రామంలోని స్త్రీలందరిపైనా దౌర్జన్యాలు చేసి బీభత్సం సృష్టించింది. అయినా కష్టమొస్తే మనకెందుకు అనుకోకుండా, ఎవరికివారు కాకుండా.. ఊరంతా ఒక్కటై నిలిచింది. అందుకే వీరతెలంగాణ పేరువింటే.. బైరాన్ పల్లి వీరగాథ తప్పకుండా గుర్తుకొస్తది.
అంతకు ముందు పలుమార్లు పారిపోయి, ఈసారి రైఫిల్లు, మిషన్ గన్లతో మీదపడ్డ రజాకార్లు చివరకు తమ పంతం నెగ్గించుకున్నారు. కానీ ''నిజానికి గెలుపు ఎవరిది అంటే... రాళ్లు, రప్పలు, జెజ్జాయి, మట్టిబెడ్డలతో శత్రువుతో కలబడ్డ బైరాన్‌పల్లి ప్రజలదే'' అంటున్నారు నాటి ఘటనకు సాక్షిగా నిలిచిన 94ఏండ్ల చెల్లా చంద్రారెడ్డి. ఈ పోరాటంలో అన్నదమ్ముల్ని, బంధువుల్ని కోల్పోయి నేడు కళ్లు కనిపించకున్నా... నాటి దాడిని కళ్లకు కట్టినట్టు చెప్పింది నందవోయిన లింగమ్మ. ''రక్తం చిందుతున్నా... రజాకార్ రౌడీలకు వెన్నుచూపని ధీరులు నా గ్రామ ప్రజలు'' అని ఘనంగా గుర్తు చేసుకుంది. ''నాటి క్రూరమైన ఘటనను వర్ణించేందుకైనా.. వీరుల త్యాగాన్ని కీర్తించేందుకైనా మాటలే చాలవన్నారు'' అనేక విషయాల్ని నాతో పంచుకున్న ఆ ప్రాంతవాసి, ప్రజారచయిత సాంబరాజు యాదగిరి.
నాటి వీరత్వానికి గుర్తుగా గ్రామంలో కొంత స్థలం కేటాయించి అమరుల స్థూపాలు నిర్మించాలనే చిన్న కోరికనూ నేరవేర్చలేని నేటి పాలకుల తీరును ప్రశ్నిస్తున్నారు ప్రజలు. నాటి పాలకుల పీడన, నేటి ఏలికల కనిపించని దోపిడీ రెండూ దాదాపు ఒక్కటే అంటున్నారు స్థానికులు. అందుకే కమ్యూనిస్టుల అండతో....
మట్టి మనుషులు నాడు చేస్తే వీరతెలంగాణ పోరాట యుద్ధం
మరో విముక్తి సమరానికి కావాలంటున్నారు నేడు సన్నద్ధం.