Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శేరి లింగంపల్లిలో పేదల గుడిసెలు కూల్చివేత
- ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టేందుకు సర్కారు యత్నం
- రోడ్డున్న పడిన 300 కుటుంబాలు
- ప్రజలను తరలించేందుకు తాగునీరు, కరెంట్ బంద్
- మా ప్రాణాలు పోయినా జాగాలు వదులుకోం : బాధితులు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పేదల గుడిసెలకు పట్టాలు ఇస్తామని గంటా పథంగా చెప్పిన ప్రభుత్వమే ఆ స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. మూప్పదేండ్లుగా ఇదే ప్రాంతంలో ఉంటూ కాయకష్టం చేసి పోగేసిన డబ్బులతో పేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చేసింది. దీంతో పేదల బతుకులు ''గూడు చెదిరిన పక్షిలా'' మారాయి. ఎక్కడికి పోవాలో దిక్కుతోచక.. మట్టి పెల్లలపైనే జీవనం గడుపుతున్నారు. అక్కడి నుంచి వారిని తరలించేందుకు ఆ బస్తీకి తాగు నీరు, కరెంట్ బంద్ చేయడంతో చీకట్లల్లో బిక్కు..బిక్కుమంటున్నారు. సావనైనా సస్తాం గానీ ఈ జాగను వదివెళ్లేది లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర నలుమూల నుంచి హైదరాబాద్కు బతుకుదెరువు కోసం వచ్చిన వలస కార్మికులంతా ఎక్కువగా శివారు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లాలో నివాసం ఉంటున్నారు. అప్పటి స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలతో ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్న చోట పేదలు గూడిసెలు వేసుకు న్నారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కరెంట్, వాటర్ సౌకర్యం కల్పించారు. అయితే, ఆయా ప్రాంతాల్లోని ఆ భూములకు మంచి డిమాండ్ రావడంతో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల, పెట్టుబడు దారుల కన్ను పేదలు ఉంటున్న స్థలాలపై పడింది. దీంతో పేదలను గుడిసెల నుంచి వెళ్లగొట్టి.. ఆ స్థలాలను లాక్కునేందుకు అధికార పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం కూడా వంతపాడుతూ.. గుడిసెలను కూల్చేసింది. రంగారెడ్డి జిల్లాలోని శేరి లింగంపల్లి, గౌలిదొడ్డి గ్రామపంచాయతీ గోపనపల్లి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 37లో 30 ఏండ్ల కింద బండలు, రాళ్లు కొట్టి జీవనం సాగించే వడ్డెర సామాజిక తరగతికి చెందిన కుటుంబాలు 40 గుడిసెలు వేసుకున్నారు. ప్రస్తుతం 300 కుటుంబాలు ఆ బస్వతారకం బస్తీలో నివాసం ఉంటున్నాయి. పేదలు ఉంటున్న భూములకు మంచి ధర పలుకుతోంది. స్థానిక అధికార పార్టీ
నాయకులు.. బడా పెట్టుబడుదారులకు వాటిని కట్టబెట్టేందుకు ప్రభుత్వాధికారులు యత్నిస్తున్నట్టు తెలిసింది. నెల రోజుల కిందట గుడిసెవాసులు పనులకు వెళ్లగానే సామాగ్రిని రోడ్డున పడేసి, చిన్నారులను, వృద్ధులను బయటకు గెంటేసి కూల్చేశారు. ఎన్నికల సమయంలో మీగుడిసెలకు పట్టాలు ఇప్పిస్తామన్న నాయకుడే.. మా గుడిసెలకు బేరం పెట్టిండని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా కష్టం నేలపాలైంది
'చేతులు బొబ్బలు రాంగ రాయి కొట్టి పైస..పైస కూడబెట్టుకుని ఇండ్లు కట్టుకున్నాం. సర్కారు మాకు ఒక్క మాటైనా చెప్పకుండా.. మేము పనులకు పోయాక ఇండ్లలోని సామాను తీసి కూల్చేశారు. ఇంట్లో దాచుకున్న డబ్బులు, బంగారం మట్టిలో కలిసి పోయినవి. కనీసం తినడానికి తిండి గింజలు లేకుండా చేశారు. మా మీద కక్షకటిన సర్కారు కనీసం తాగు నీరు రాకుండా చేసింది. నెల రోజులుగా ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా.. మూప్పదేండ్లుగా మాకు రక్షణ ఇచ్చిన జాగను కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నాం. మా గుడిసెలకు పట్టాలు ఇప్పిస్తాన్న ఎమ్మెల్యే కాలనీ వైపే చూడటం లేదు' ఇదీ బస్వతారకం బస్తీ వాసుల ఆవేదన.
రూ.2 లక్షల డబ్బులు మట్టిలో పోయాయి : బాధితుడు ఎస్.నర్సింహా
నా బిడ్డ పెండ్లి కోసం రూ.2లక్షలు.. రూ.4 వడ్డీకి తెచ్చి ఇంట్లో పెట్టిన.. రెవెన్యూ అధికారులు చెప్పాబెట్టకుండా గుడిసెలు కూల్చివేయడంతో పెండ్లికి తెచ్చిన బంగారం, డబ్బులు మట్టిలో పోయాయి. వచ్చిన వారు ఎత్తుకపోయారో, ఎవరు తీసుకున్నారో తెలియడం లేదు. ఇల్లు కూలి..డబ్బులు లేక నా బిడ్డ పెండ్లి ఆగిపోయింది. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలి.
మా ఇండ్ల స్థలాలు మైహోంకు ఇస్తారంట : బాధితుడు కర్రెప్ప
అప్పట్లో అడివిగా ఉన్న ప్రాంతాన్ని చదును చేసుకొని ఇండ్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఈ జాగకు విలువ వచ్చేసరికి సర్కారు కన్ను పడింది. ఎమ్మెల్యే మా ఇండ్ల జాగాలను మైహోంకు అమ్మించేందుకు కుట్రలు చేస్తుండు. మాకు అండగా ఉంటాడని ఓట్లు వేసినంగానీ.. గిట్లా చేస్తాడని అనుకోలేదు..
ప్రాణం పోయినా జాగ ఇచ్చేది లేదు..
35 ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం : బాధితురాలు మల్లిక
బతుకుదెరువు కోసం 50 ఏండ్ల కింద హైదరాబాద్కు వచ్చాం. మా బాధలు చూడలేక అప్పటి ఎమ్మెల్యే విజయరామారావు ఇక్కడ గుడిసెలు వేసుకోండని దారి చూపిండు..కరెంటు, తాగు నీటి కోసం చేతి పంపు వేశాడు. మా తల్లిదండ్రుల బొందల గడ్డలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంత కాలం మా దగ్గరకు గుడిసెలు ఖాళీ చేయాలని ఎవరూ రాలేదు. సర్కారు మమ్మల్ని తిప్పలు పెడుతోంది.
ప్రభుత్వ భూములో ఉన్న ఇండ్లనే తొలిగించాం : ఆర్డీవో చంద్రకళ
బస్వతారకం బస్తీలో నిర్మించిన ఇండ్లు అన్నీ ప్రభుత్వ భూముల్లో ఉన్నవే. అందువల్ల ప్రభుత్వ ఆదేశాలకు మేరకు కూల్చేశాం. బస్తీలో ఇండ్లు కోల్పోయిన 251 మంది కుటుంబాలకు ఇతర ప్రాంతాల్లో ఇచ్చేందుకు కలెక్టర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో వారికి ఇండ్లు ఇస్తాం.