Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'హద్దులు' దాటుతున్న పందెం కోళ్లు
- పుంజుల పెంపకానికి ప్రత్యేకంగా వెలిసిన ఫారాలు
- రాష్ట్రంలో కోవిడ్ నిషేధాజ్ఞలతో ఆంధ్రాలో బిరులు
- కోర్టులు వద్దన్నా.. పోలీసులు అడ్డుకున్నా ఆగని పందేలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి, అశ్వారావుపేట
సంక్రాంతి అంటే కోడిపందేలు.. కోడి పందేలు అంటే సంక్రాంతి అంటారు. ఈ సమయంలో ఆంధ్రా సరిహద్దులోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో చంకన పుంజులు పెట్టుకుని పందెం రాయుళ్ల పరుగులు పెడుతున్నారు. కోవిడ్ నిబంధనలున్నా కోర్టులు వద్దన్నా.. పోలీసులు అడ్డుకున్నా తమ పంథా వీడేది లేదనే రీతిలో ఇప్పటికే జోరుగా పందేలు కొనసాగుతున్నాయి. రూ.లక్షల్లో పందేలు కాస్తూనే ఉన్నారు. ఇదేమంటే.. సంక్రాంతి మళ్లా ఏడాదికి వస్తది.. రూ.వేలు వెచ్చించి పుంజులు పెంచి, ఫారాల్లో కోళ్లుకొని బరిపై గురితో ఉన్నామని పందెంరాయుళ్లు దీర్ఘాలు తీస్తున్నారు. పామాయిల్, జీడిమామిడి తోటల్లో పందేలు నిర్వహిస్తున్నారు. పోలీసుల కంటపడకుండా గుట్టుచప్పున పని కానిస్తున్నారు.
పూర్వ ఖమ్మం జిల్లాలో కొన్ని బిరులు ఆంధ్రాను తలపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్, ఇతరత్రా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ రూ.లక్షల్లో వేతనాలు గడిస్తున్న వారు సైతం పందేనికి సై అంటున్నారు.
బిరులోకి దిగేందుకు భారీగా సన్నద్ధం
ఆంక్షలెన్ని ఉన్నా కోడి కాలుకు కత్తి కట్టాల్సిందే.. అనే రీతిలో పందెంరాయుళ్లు సిద్ధమయ్యారు. బిరులోకి (పందెం నిర్వహించే స్థలం) దిగేందుకు సన్నద్ధులయ్యారు. కత్తులు కట్టడంలో నిపుణులను పోలీసులు బైండోవర్ చేసినా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటూనే ఉన్నారు. జాతి కోడి పుంజులకు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి కయ్యానికి కాలు దువ్వేలా సిద్ధం చేశారు. అశ్వారావుపేట, పెనుబల్లి, సత్తుపల్లి, దమ్మపేట మండలాల్లోని పలుచోట్ల పందెం కోళ్ల పారాలు వెలిశాయి. వీటిలో తమిళనాడులోని సేలం జిల్లా నుంచి ప్రత్యేకంగా కోడిగుడ్లను తీసుకొచ్చి పొదిగిస్తున్నారు. స్థానికంగా మంచి రకాల కోళ్లను బ్రీడ్ చేసి వాటి పిల్లలను పెంచుతున్నారు. కర్నూలు జొన్నలు, జీడిపప్పు, పిస్తా, బాదం పప్పు తదితర బలవర్థక ఆహారం పెడుతున్నారు. పారం నిర్వాహకులు సైతం రూ.లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. కొందరు ఆంధ్రాలోని గోదావరి, నెల్లూరు జిల్లాల నుంచి కూడా పుంజులు తీసుకొస్తున్నారు.
అశ్వారావుపేట, వినాయకపురం, నారంవారిగూడెం, తిరుమలకుంట, జమ్మిగూడెం, దమ్మపేట, నాగుపల్లి, పట్వారీగూడెం, పెద్దగొల్లగూడెం, వడ్లగూడెం, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లోని మేడిశెట్టివారిపాలెం, ముత్తగూడెం, చండ్రుగొండ, ములకలపల్లి మండలాల్లో పలుచోట్ల పందేలు నిర్వహిస్తున్నారు. అశ్వారావుపేట మండల సరిహద్దు ఆంధ్రప్రదేశ్లోని జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, దమ్మపేట సరిహద్దులోని రాఘవపురం, చింతంపల్లి, సీతానగరం, పట్టాయిగూడెంలో పందేలు జోరుగా సాగుతున్నాయి.
కుక్కుటశాస్త్రం ఆధారంగా పందేలు..
నల్లని ఈకల కాకి, ఎర్రని ఈకల డేగ, పసుపు ఈకల నెమలి, నలుపు, ఎరుపు ఈకల కౌజు, తెల్లని ఈకల సేతువ, ఎరుపు, బూడిదరంగు మైల, ముంగిస, అబ్రాసు, పచ్చకాకి, నలుపు, ఎరుపు కాకిడేగ ఇలా రకరకాల పుంజులను కుక్కుటశాస్త్రం ఆధారంగా బరిలో దించుతారు. సమయాన్ని బట్టి ఏ కోళ్లు గెలుస్తాయో వాటిని బరిలోకి ప్రవేశపెడతారు. ముసుగు పందెం, కత్తి పందెం, విడికాళ్లు, జోడి పందెం, చూపుడు పందెం ఇలా పలు రకాలుగా పుంజులను బరిలోకి దింపుతారు.
జూదమాడితే కఠిన చర్యలు
ఎన్.వెంకటేశ్- ఏసీపీ- కల్లూరు
రాష్ట్రంలో కోడిపందేలకు అనుమతి లేదు. ఎవరైనా పందెం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆంక్షలకు తోడు కోవిడ్ నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. ఎక్కడైనా కోడిపందేలు వేసినా, పేకాట ఆడినా సమాచారం ఇవ్వండి. వివరాలు గోప్యంగా ఉంచుతాం.