Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నం
- యూపీలో ప్రత్యర్థులపై వేధింపులు సరికాదు
- ధరలను అరికట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలం
- సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తున్న కేంద్రం
- రాష్ట్రాల హక్కుల కోసం కేసీఆర్, జగన్ కలిసి రావాలి
- ఫిబ్రవరి 23,24 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు సంఘీభావం : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
- 23 నుంచి 25 వరకు రాష్ట్ర మహాసభలు యథాతధం : తమ్మినేని
22న ఆన్లైన్లో బహిరంగసభ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్యానికే ప్రమాద కరమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదనీ, ప్రజాస్వామిక హక్కులకు భంగం కలిగిస్తున్నదని విమర్శించారు. నిరంకుశ పద్ధతిలో రాజ్యాంగ వ్యవస్థను మార్చడం చాలాకాలం నుంచి జరు గుతున్నదని అన్నారు. బుధవారం నుంచి రెండురోజులపాటు జరిగిన సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశాలు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ తాజాగా యూపీలో బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఎస్పీలో చేరిన మౌర్యపై ఏడేండ్ల కిందటి పాత కేసును బయ టికి తీసి వేధించడానికి పూనుకుందని చెప్పారు. గతంలోనూ బీజేపీని ప్రతిఘటించే వారిపై పాతకేసులు తీసి, కేంద్ర నిఘా సం స్థలైన ఎన్ఐఏ, సీబీఐ, ఈడీని పురికొల్పి వేధించడం అలవాటుగా మారిందని విమర్శించారు. నిరంకుశ ప్రభు త్వం, నిరంకుశ పార్టీలు ఇలాంటి పనులు చేస్తాయన్నారు. ఇలాంటివి ఉపేక్షిస్తే రాజ్యాంగ వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ముక్తకంఠంతో ప్రత్యర్థులపై వేధింపులను అరికట్టేందుకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు నిలవాలని కోరారు.
ఎరువుల ధరలను నియంత్రించాలి
నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా యని రాఘవులు చెప్పారు. ధరలను అరికట్టడంలో, ప్రజల ఆదాయాలను రక్షించడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ఎక్సైజ్డ్యూటీ, ఇతర ఛార్జీలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రసాయనిక ఎరువుల ధరలు రెట్టింపయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ గిట్టుబాటు ధరలేక రైతులు సంక్షోభంలో ఉన్నారని అన్నారు. ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలని కోరారు. పెరుగుతున్న ధరలను అరికట్టేం దుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతర పార్టీలను కలుపుకుని అవసరమైన కార్యాచరణను రూపొంది స్తామన్నారు. ప్రయివేటీకరణను ఆపాలనీ, ధరలను అరికట్టాలనీ, నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ఉపసంహరిం చాలనీ, కార్మిక కోడ్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఫిబ్రవరి 23,24 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఇతర శక్తులు, పార్టీలు మద్దతుగా నిలవాలని కోరారు. సమా ఖ్య వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తున్నదని విమర్శించారు. దాన్ని పరిక్షించేందుకు, రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ పూనుకున్నా రని చెప్పారు. వివిధ రాష్ట్రాల సీఎంలతో సమన్వయంతో పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఆ చర్చలు కొలిక్కి వచ్చాక సీపీఐ(ఎం) ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతుందని అన్నారు. రాష్ట్రాలకు జరుగుతున్న నష్టాలను, ప్రయోజ నాలు, హక్కులను రక్షించుకునేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ కలిసి రావాలని సూచించారు. లేకపోతే ఏపీ, తెలంగాణ తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా సమాఖ్య విధానాన్ని పార్టీలు, ప్రభుత్వాలు రక్షించుకోవడం అవసరమనీ, ఉమ్మడిగా కలిసొచ్చే అంశాలను చర్చించడం కోసమే కేసీఆర్‌ను విజయన్ కలిశారని చెప్పారు.
బీజేపీని నిలువరించడమే లక్ష్యం : తమ్మినేని
సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభలు ఈనెల 23 నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో యథాతధంగా జరుగుతాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. 22న సాయంత్రం నాలుగు గంటలకు ఆన్లైన్లో బహిరంగ సభ ఉంటుందన్నారు. చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగే ఈ సభలో సీతారాం ఏచూరి, బృందాకరత్, బివి రాఘవులు, తనతోపాటు టి జ్యోతి ప్రసంగిస్తారని వివరించారు. ఈ మహాసభల్లో ప్రవేశపెట్టే రాజకీయ నిర్మాణ నివేదికను రాష్ట్ర కమిటీ చర్చించి ఆమోదించిందని చెప్పారు. రాబోయే మూడేండ్లలో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో చర్చించామన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రమాదకరంగా పెరుగుతున్నదని అన్నారు. ఆ పార్టీ దేశానికి ప్రమాదకరమనీ, రాష్ట్రంలోకి ఆ ప్రమాదం ముందుకొస్తున్నదని విమర్శించారు. కమ్యూనిస్టులు, వామపక్ష భావజాలం బలంగా ఉన్న రాష్ట్రంలో రాజకీయాలను కలుషితం చేసేందుకు ఆ పార్టీ వస్తున్నదని చెప్పారు. ప్రజా జీవితానికి, అభివృద్ధికి ఆటంకమని అన్నారు. మతోన్మాదం, విచ్ఛిన్నకర విధానాలను నియంతృత్వ పోకడలు, హింసను ప్రోత్సహించడం, నిరంకుశ పద్ధతులను బీజేపీ అనుసరిస్తుందని వివరించారు. రాష్ట్రంలో బీజేపీని నిలువరించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఎక్కడా ఆపార్టీ గెలవకుండా పనిచేయాలని నిర్ణయించామన్నారు. బీజేపీని వ్యతిరేకించడంలో, రాష్ట్ర ప్రయోజనాలు రక్షించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తున్నదని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌లు ప్రకటనలు ఇస్తున్నారని చెప్పారు. దేశంలో బీజేపీ ఓడిపోవాలన్న ప్రకటన సంతోషకరమేనని అన్నారు. అయితే నేరుగా కేసీఆర్ మాట్లాడ్డం లేదనీ, లీకులిస్తున్నారని వివరించారు. బీజేపీ పట్ల టీఆర్ఎస్ నికరంగా నిలబడితే సంతోషకరమని చెప్పారు. నిజాయితీగా వ్యవహరించాలనీ, స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ పాలనపై పోరుబాట
ప్రజాసమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పోరుబాట ఎంచుకోవాలని మహాసభల్లో నిర్ణయం తీసుకుంటామని తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఏడేండ్లలో అప్రజాస్వామిక పాలన కొనసాగిందన్నారు. కొన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. తెలంగాణ వస్తే ఏం సాధిస్తామో, ప్రజల జీవితాలు ఎలా మెరుగవుతాయని భావించారో అందులో ఏ ఒక్కటీ నెరలేరలేదన్నారు. ఆర్థిక స్వావలంబన, ఉద్యోగాల కల్పన, భూములకు నీళ్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి అమలు కాలేదని చెప్పారు. వీటిని ప్రశ్నించిన వారిని అణచివేస్తున్నారని అన్నారు. సమస్యలపై నికరంగా పోరాడాలని నిర్ణయించామన్నారు. 317 జీవో ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యతిరేకమని చెప్పారు. వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారనీ, సంఘాలు, రాజకీయ పార్టీలు కోరుతున్నా కేసీఆర్ మనసు మెత్తబడట్లేదని అన్నారు. పోరాడితే ఒప్పుకోను, దండం పెడితే కనికరిస్తా అన్నట్టుగా సీఎం వైఖరి ఉందన్నారు. ఆర్టీసీ, మున్సిపల్ కార్మికులు, ఆశాలు, అంగన్వాడీల సమ్మెల సమయంలో అదే జరిగిందని వివరించారు. ఈ నియంతృత్వ వైఖరి బీజేపీ ఎదుగుదలకు దోహదపడుతుందని విమర్శించారు. 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరెంటు ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఉపసంహరించాలనీ, రూ.6 వేల కోట్ల భారాలు ప్రజలపై వేయొద్దని కోరారు. అఖిలపక్షం పిలవాలనీ, నిపుణులతో చర్చించాలని సూచించారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సరైంది కాదన్నారు.
మళ్లీ పోడు భూముల పోరు
రాష్ట్ర మహాసభల తర్వాత పోడు భూముల పోరు మళ్లీ చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ్మినేని హెచ్చరించారు. పోడు భూముల హక్కుపత్రాల కోసం ఐదు లక్షల మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పట్టాలిచ్చే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. ఉద్యమాన్ని చల్లార్చేందుకు దరఖాస్తులను స్వీకరించినట్టుగా ఉందన్నారు. ధరణి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. టెక్నాలజీని వినియోగించుకోవాలనీ, తప్పుల్లేకుండా చేయాలని సూచించారు. ఇంకా 20 లక్షల ఎకరాల భూమికి సంబంధించిన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. రైతుబంధు ఇవ్వాల్సి వస్తుందనే పరిష్కరించడం లేదన్న అనుమానాలు వస్తున్నాయని అన్నారు. భూ సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయాలని డిమాండ్ చేశారు. భూ ఉద్యమాన్ని చేపడతామన్నారు. కార్మికులకు రెండేండ్లకోసారి కనీస వేతనాలను సవరించాలని కోరారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనీ, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలతోపాటు లౌకిక పార్టీలతో కలిసి ముందుకుసాగుతామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసించాలన్నారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలన్నది తమ రాజకీయ విధానం కాదని తమ్మినేని చెప్పారు. అయితే బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు.
తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ద్రోహం
వామపక్షాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు నింద వేశారని రాఘవులు అన్నారు. బీజేపీ తెలుగు రాష్ట్రాలకు తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. విభజన సమయంలో చేసిన వాగ్ధానాలను వమ్ము చేసిందన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా, తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఖమ్మం స్టీల్‌ప్లాంట్ ఇవ్వలేదనీ, సింగరేణి బొగ్గుగనులను ప్రయివేటీకరించి మోసం చేసిందని చెప్పారు.
విద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి, విద్వేషాలు పెంచడానికి ఇక్కడ భాగ్యనగర్, అక్కడ జిన్నా టవర్ సమ స్యలను ముందుకుతెస్తున్నదని విమర్శించారు. నికరంగా పోరాడుతున్న వామపక్షాలపై సంజరు దాడి చేస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రమాదాన్ని తెలంగాణ ప్రజలు విస్మరిం చొద్దని కోరారు. వారి విద్రోహాన్ని బట్టబయలు చేయాలని సూచించారు. కరోనా రోగులకు ఖర్చులేకుండా అందరికీ ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఉపాధి దెబ్బతింటున్నదని అన్నారు. ప్రతి కుటుంబానికీ రూ.7,500 ఇవ్వాలంటూ తాము కోరుతున్నామని చెప్పారు.