Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ విద్యార్థులకు వెంటనే ఫీజురీయింబర్స్‌మెంట్, సాల్కర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రెండేండ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్పులు చెల్లించకపోవడంతో ఫీజులు కట్టాలని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని పేర్కొన్నారు. బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసినా ఫీజు కట్టనిదే సర్టిఫికెట్లు ఇవ్వబోమని యాజమాన్యాలు చెబుతుండటంతో దాదాపు 14లక్షల విద్యార్థులు క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ కోర్సులకు ఫీజులు ఎంత ఉంటే అంత ప్రభుత్వమే చెల్లించిన విషయాన్ని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 10 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి మాత్రమే ఫీజులు మంజూరు చేస్తూ ఆ పై ర్యాంకు వచ్చిన వారికి రూ. 35 వేలు మాత్రమే ఇస్తున్నదని విమర్శించారు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఐఐటీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే వారికి పూర్తిగా ఫీజులు చెల్లించేలా జీవో నెంబర్ 18ను సవరించాలని డిమాండ్ చేశారు.