Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనగామలో 15 రోజులుగా రైతుల నిరీక్షణ
నవతెలంగాణ- జనగామరూరల్
ధాన్యం కొనుగోళ్లు బంద్ అయ్యే 15 దాటుతోంది. అయినా ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో పడలేదు.. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు రేపు మాపు అంటూ జరుపుతున్నారు. ఇదీ జనగామ పీఏసీఎస్ కార్యాలయ దుస్థితి. జనగామ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,37,171.729 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఐకేపీ కేంద్రాల ద్వారా రూ.96.89కోట్లు, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.268 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించారు. ఇందులో రూ.210 కోట్లు రైతులకు చెల్లించారు. సుమారు 400మంది రైతులకు రూ.58 కోట్లు చెల్లించాల్సి ఉంది. నెల రోజులు మార్కెట్లోనే ఉండి పంటను అమ్ముకోవాల్సి వచ్చింది. చివరకు ఆ డబ్బుల కోసం కూడా ఎదురు చూడాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.ధాన్యం కొనుగోళ్లలో కోత పేరిట రూ.7 కోట్ల కుంభకోణం జరిగినట్టు 'నవతెలంగాణ' రాసినందున.. వివరాలు అందించినందుకు జిల్లా సహకార శాఖ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. చౌడారం గ్రామానికి చెందిన మదార్ అనే రైతును బుధవారం నాలుగు గంటలపాటు కార్యాలయంలో నిర్బంధించారు. గీత కార్మికుడు అయిన సదరు రైతు తాడి చెట్లు ఎక్కేందుకు వెళ్లగా సహకార శాఖ సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని జిల్లా సహకార శాఖ కార్యాలయానికి తీసుకువెళ్లినట్టు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది.
వెంటవెంటనే డబ్బులు జమచేస్తున్నాం
సంధ్యారాణి- పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్
రైతుల ధాన్యం వివరాలను సహకార శాఖ సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేయడంలో ఆలస్యం జరుగుతోంది. నమోదు చేయగానే మిల్లర్ అనుమతి రాగానే రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నాం. జిల్లాలో ఇంకా రూ.58కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. చెల్లింపు ప్రక్రియ ప్రాసెస్‌లో ఉంది.చర్యలు తీసుకుంటాం
కిరణ్‌కుమార్- జిల్లా సహకారశాఖ అధికారి
జనగామ మండలం చౌడారం గ్రామానికి చెందిన రైతు మదారును పిలిపించుకుని వివరాలు సేకరించి పంపించి వేశాం. కొనుగోలు సమయంలో అతనికి ఏ మేరకు కోత విధించారో తెలుసుకున్నాం. రైతులు ఆర్థికంగా నష్టపోకుండా చర్యలు తీసుకుంటాం.