Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 రోజుల్లో 10 నుంచి 35 శాతానికి
- జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. నెల రోజుల పాటు విదేశాల నుంచి వచ్చిన వారిలోనే బయటపడిన వేరియంట్, కొంత మంది స్థానికుల్లోనూ బయటపడింది. అయితే ఈ ఏడాది మొదట్నుంచి కేసుల్లో అనూహ్యంగా పెరుగుదల చోటు చేసుకుంది. అప్పటికీ జీహెచ్ ఎంసీ పరిధిలోనూ ఎక్కువగా కేసులు పెరగగా ఇతర జిల్లాల్లో అంతకు ముందు మాదిరిగానే నామమాత్రంగా నమోదు చోటు చేసుకుంది. గత వారం రోజుల నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. అంతకు ముందు జీహెచ్ఎంసీ పరిధిలోనే 80 నుంచి 90 శాతం వరకు కేసులుండగా, ఈ వారం రోజుల నుంచి ఇతర జిల్లాల నుంచి కేసులు పెరగడంతో అక్కడ 40 శాతం నుంచి 50 శాతం వరకు వస్తున్నాయి. సంక్రాంతి సెలవులకు ముందే ప్రజలు పెద్ద ఎత్తున ఆయా జిల్లాలకు తరలి వెళ్లడం కూడా ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తున్నది.
జనవరి ఒకటిన రాష్ట్రంలో 274 కేసులు రాగా అందులో 247 కేసులు జీహెచ్ఎంసీ, మేడ్చల్ - మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు చెందినవే. మిగిలిన రాష్ట్రమంతా కలిపి 27 (9.85 శాతం) పాజి టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. వారం రోజుల తర్వాత జనవరి ఎనిమిది నాటికి రాష్ట్రంలో కేసులు 10 రెట్లు పెరిగి 2,606 వచ్చాయి. ఇందులో 2,089 జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల్లో ఉండగా రాష్ట్రమంతా కలిపితే 517 (19.83 శాతం) ఉన్నాయి. జనవరి 13న రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో 2,707 మందికి వైరస్ ఉన్నట్టు గుర్తించారు. 1,778 జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలకు పరిమితం కాగా, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో 929 (34.39 శాతం) కేసులొచ్చాయి. గ్రామీణ ప్రాంతాలున్న జిల్లాల్లో కేవ లం 13రోజుల వ్యవధిలో 9.85 శాతం నుంచి 34.39 శాతం కేసులు పెరగడం ఒమిక్రాన్ వ్యాప్తి గ్రామాలవైపు వెళుతుంద నేందుకు సంకేతంగా కనిపిస్తున్నదని వైద్యులు చెబుతున్నారు. దీనికితోడు సంక్రాంతిసెలవుల సందర్భంగానగరాలు, పట్ట ణాల నుంచి గ్రామాలకు వెళ్లే వారితో ఇది మరింతగా పెరిగే అవకాశముందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అంచనా వేసింది.
జాగ్రత్తలు తీసుకోవాలి....
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు భారీగా పెరుగుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా నగరాల నుంచి గ్రామాల వైపు ఒమిక్రాన్ వ్యాపిస్తుండటంతో కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరుతున్నారు. మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడంతో పాటు అర్హులైన వారంతా వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2,398 మందికి కరోనా
రాష్ట్రంలోకొత్తగా 2,398మందికి కరోనాసోకింది. ముగ్గురుమరణించారు. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 68,525 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 10,118 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,676 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 1,233 మందికి కరోనా సోకింది. కాగా గురువారం 84,280 మందికి పరీక్షలు చేయగా 2,707 కేసులొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా 16 వేల టెస్టులు తగ్గాయి. అదే క్రమంలో కేసులు కూడా 300 తక్కువగా బయటపడ్డాయి.