Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గుండె పోటుతో హఠాన్మరణం పొందిన ప్రభుత్వ పరీక్షల విభాగం (డీజీఈ) సంచాలకులు అలుగు బెల్లి సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఆయన భార్య, పిల్లలను ఆమె ఓదార్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో సత్యనారాయణరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన మరణం పట్ల సబితా ఇంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాశాఖలో అనేక పదవులు నిర్వహించిన ఆయన సమర్థవంతంగా సేవలందించారని కొనియాడారు. సత్యనారాయణరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, ఇతర అధికారులున్నారు. మంచి అధికారిని కోల్పోవడం బాధాకరమని తెలిపారు. గుండెపోటుతో సత్యనారాయణరెడ్డి గురువారం మరణించిన విషయం తెలిసిందే. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం తెలిపారు. పేద కుటుంబం నుంచి వచ్చి ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుల స్థాయికి సత్యనారాయణరెడ్డి ఎదిగారని ఎస్టీయూటీఎస్ అధ్యక్షులు జి సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్‌రెడ్డి పేర్కొన్నారు. అర్థాంతరంగా తనువు చాలించడం బాధాకరమని తెలిపారు. మోడల్ స్కూళ్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని టీఎస్ఎంఎస్టీఎఫ్ అధ్యక్షులు బి కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్ మహేష్ తెలిపారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.సత్యనారాయణరెడ్డి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నాగోల్ శ్మశాన వాటిలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.