Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి హరీశ్‌రావు అభినందనలు
నవతెలంగాణ - సిద్దిపేట
సిద్దిపేట జిల్లాకు కేంద్ర తాగునీరు, పారిశుధ్య విభాగం జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రశంస లభించింది. జలశక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రెటరీ అరుణ్ బరోక అభినందన లేఖను జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులకు పంపారు. భారత ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో తాగునీరు, పారిశుధ్య విభాగంలో ప్రశంసనీయమైన పనిని, జాతీయ స్థాయి లఘు చిత్రాల పోటీ 'స్వచ్ఛ్ ఫిల్మ్ కా అమృత్ మహోత్సవ్-2021'లో పాల్గొనడాన్ని అభినందిస్తుందని లేఖలో పేర్కొన్నారు. భారతదేశం మిషన్ (గ్రామీణ) ఫేజ్-2లో భాగంగా 'సంపూర్ణ స్వచ్ఛత' సాధించడానికి సిద్దిపేట జిల్లాలో పనితీరు, లక్ష్యాల సాధన ప్రేరణ ఇస్తుందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అధ్వర్యంలో లఘు చిత్రాల పోటీ (స్వచ్ఛత ఫిల్మోన్ కా అమృత్ మహోత్సవ్) -2021లో భాగంగా జిల్లాలో తాగునీరు, పారిశుధ్య విభాగంలో సాధించిన ఫలితాలను తెలుపుతూ.. జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్ పర్యవేక్షణలో 160కి పైగా లఘు చిత్రాలను రూపొందించి పంపారు. జిల్లా అభివృద్ధిని వీక్షించి కేంద్ర తాగునీరు, పారిశుధ్య విభాగం, జలశక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రెటరీ అరుణ్ బరోక అధికారులను అభినందిస్తూ లేఖను పంపారు.
సమిష్టి కృషి ఫలితమే: మంత్రి హరీశ్‌రావు
స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అధికారుల, క్షేత్ర సిబ్బంది కృషి, ప్రజల సహకారంతో సిద్దిపేట జిల్లాలోని గ్రామాలు, పల్లెలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నారు. తాగునీరు సరఫరా, పారిశుధ్య నిర్వహణలో గ్రామాలు మునుపెన్నడూ లేనివిధంగా అద్భుతమైన ఫలితాలు సాధించాయి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రశంసలో సమిష్టి కృషి ఉంది. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, శానిటేషన్ సిబ్బంది పని చేయాలి. కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు ప్రత్యేక అభినందనలు.
మంత్రి మార్గదర్శనంతో ప్రత్యేక గుర్తింపు
కలెక్టర్ ఎం.హనుమంతరావు
ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మార్గదర్శనంతోనే సిద్దిపేట జిల్లాలోని గ్రామాలు దేశంలోని మిగతా పల్లెలలకు అన్ని రంగాల్లో స్ఫూర్తిగా నిలిచాయి. స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో జిల్లా అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్ పర్యవేక్షణ, గ్రామీణ అభివృద్ధి అధికారులు, పంచాయతీ సెక్రటరీల ప్రత్యేక చొరవతో పల్లెల్లో మౌలిక సదుపాయాలు పెంపొందుతున్నాయి. జిల్లాకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభించడం మనందరికీ గర్వకారణం.