Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రుల సిబ్బందిపై వివక్ష తొలగించదు.....
-నగరంలోని ఆస్పత్రుల్లో నర్సులు ఖాళీ
- గ్రామాల్లో మొదలు కాని సేవలు
- కరోనా వేళ తప్పుడు నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బందులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అంటువ్యాధులు వస్తుంటాయి..... పోతుంటాయి. కానీ వాటి తాలుకూ సమాజంలో పేరుకుపోయే అపోహలు, మూఢ నమ్మకాలు, అశాస్త్రీయ అవగాహన వ్యాప్తి పేరుకుపోయి ఉంటుంది. అది కాస్తా అనేక అనర్థాలకు దారి తీస్తుంది. వాటి నుంచి ప్రజలను శాస్త్రీయ ఆలోచన వైపు నడిపించకుంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను విస్తరించాల్సిన అవసరముందని గుర్తించినప్పటికీ.... అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో మాత్రం సర్కారు విఫలమవుతూనే ఉన్నది. ఒకవైపు కరోనా థర్డ్ వేవ్‌తో ఉన్న సిబ్బందిలో ఎక్కువ మంది పాజిటివ్ బారిన పడి సేవలందించలేని పరిస్థితి. మరోవైపు బదిలీల పేరుతో రిపోర్టింగ్ కు, రిలీవ్‌కు మధ్య సమన్వయం లేకుండా చేస్తుండటంతో ప్రజలకు సేవలందించాల్సిన ఆస్పత్రులు నిస్తేజంగా మారిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి రిలీవ్ అయిన వారు ఆయా గ్రామాల్లో వసతి దొరకక సేవలు మొదలు పెట్టకపోగా, నిలోఫర్ లాంటి ఆస్పత్రికి కేటాయించిన వారు ఇంకా రిపోర్టింగ్ చేయకపోవడంతో నగరంలోనూ, గ్రామాల్లోనూ పూర్తి స్థాయిలో సేవలందించలేని వాతావరణం ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిన వారు రిపోర్టింగ్ చేసి సెలవు పెట్టు....హైదరాబాద్ బాట పట్టు అన్నట్టుగా వెనక్కి తిరుగుతున్నారు.
పల్లెల్లో సేవలందించేందుకు డాక్టర్లు ఎవ్వరూ ముందుకు రావడం లేదు అనేది ప్రభుత్వాలు మొదట్నుంచి చేస్తున్న వాదన. తగిన సౌకర్యాలు కల్పిస్తే సేవలందించేందుకు తాము సిద్ధమని డాక్టర్లు ఇస్తున్న కౌంటర్. తాజాగా నర్సుల పరిస్థితి అలాగే తయారైంది. ఏండ్ల తరబడి చేసిన ఉద్యమాల ఫలితంగా వచ్చిన ఉద్యోగాలు. చేరిన కొద్ది కాలానికే ఆయా జిల్లాలకు బదిలీపై పంపించారు. తీరా చూస్తే అక్కడ ఉండేందుకు వసతి లేదు. దీనికి తోడు కరోనా సమయంలో ఆస్పత్రుల్లో పని చేసే సిబ్బందికి ఇండ్లు కిరాయికి ఇచ్చేందుకు జనం జంకుతున్న వైనం. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో బదిలీ అయిన నర్సులను రిలీవ్ చేసేందుకు సూపరింటిండెంట్లు అంగీకరించలేదని తెలిసింది. కొత్త వారు రిపోర్ట్ చేసేంత వరకు సేవలకు అంతరాయం కలగకుండా ఈ చర్య చేపట్టినట్టు తెలిసింది. అయితే నిలోఫర్ నుంచి మాత్రం 130 మంది నర్సులను రిలీవ్ చేయగా ఆ స్థానాల్లో బదిలీపై వచ్చిన వారు మాత్రం రిపోర్ట్ చేయకపోవడంతో సేవలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
క్వార్టర్స్ కట్టరెందుకు?
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు సమాంతంరంగా విస్తరించకపోవడానికి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి వసతి కల్పించకపోవడం, వారికి అవసరమైన సౌకర్యాలు లేకపోవడమే ప్రధాన కారణమంటూ పలు అధ్యయనాలు తేల్చాయి. కేవలం ఆస్పత్రి నిర్మాణం, సిబ్బంది నియామకంతోనే సేవల విస్తరణ సాధ్యం కాదని గతానుభవాలు చెబుతున్నాయి.పట్టణాల్లో లభించే మౌలిక సదుపా యాలు కల్పిస్తే తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఆయా సేవలు విస్తరించి, పట్టణాలు,నగరాల్లోని ఆస్పత్రుల పై భారం తగ్గే అవకాశం కనిపించడం లేదు.