Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.410కోట్లతో పర్యాటక కేంద్ర నిర్మాణానికి అడుగులు
- ఇప్పటికే తీగల వంతెన నిర్మాణం పూర్తి
-డైనమిక్ లైటింగ్ ఏర్పాటుకు రూ.6కోట్లు మంజూరు
- ఇప్పటికే డీపీఆర్ పూర్తి..పండుగ తర్వాత టెండర్ల ప్రక్రియ
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎల్ఎమ్డి గేట్ల నుంచి తీగల బ్రిడ్జి వరకు నిర్మించబోయే మానేరు రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు రాష్ట్రంలోనే అతిపెద్ద టూరిజం హబ్‌గా నిలవబోతోంది. రూ.410కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే కేబుల్‌బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. చెక్‌డ్యామ్‌ల ద్వారా 12 నుంచి 15అడుగుల లోతులో నీటిని నిల్వ చేసి ఇరువైపులా పార్కులు, రెస్టారెంట్లు, ఇతర భవన సముదాయాలతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు నమూనాను ఇటీవల మంత్రి గంగుల విడుదల చేశారు. ఆ సుందరదృశ్యాలు వాస్తవరూపం దాల్చితే ఉత్తర తెలంగాణకే ముఖద్వారంగా కరీంనగర్ జిల్లా నిలవబోతుంది.
ప్రాజెక్టులో బోటింగ్, అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, పౌంటేన్లు, చిల్డ్రన్ పార్క్స్, ఆడిటోరియం, మ్యూజియం, కిడ్స్ ప్లే ఏరియాలు, సీనియర్ సిటిజన్, ప్లవర్, రాక్ గార్డెన్లు, లేజర్ షోలు, విశాలమైన లాండ్ స్కేపింగ్స్ ఇంకా స్పోర్ట్ ఎన్‌క్లేవ్‌లో భాగంగా టెన్నిస్, వాలీబాల్ ఇతర స్పోర్ట్స్ కోర్టులు, ప్రాజెక్టు పొడవునా వాకింగ్, జాగింగ్ ట్రాక్‌లు నిర్మించనున్నారు. ఇన్ని అంశాలతో మిలితమై ఉన్న ఈ ప్రాజెక్టు మొత్తం 10కిలోమీటర్ల మేర ఉండనుంది. అయితే, తొలిదశలో 3.7కిలోమీటర్ల మేర పనులు చేయనున్నారు. రెండో దశలో 6.25కిలోమీటర్ల పనులు పూర్తి చేయాలని డీపీఆర్‌లో నిర్ణయించారు. ఇది డ్యామ్ దిగువ భాగంలో నిర్మిస్తూనే డ్యామ్లోపల ఉన్న గుట్టపై కేసీఆర్ ఐలాండ్ నిర్మాణానికీ నిధులు సమృద్ధిగా ఉన్నాయని మంత్రి గంగుల ఇటీవల ప్రకటించడం గమనార్హం. ఈ రెండు ప్రాజెక్టుల పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను ఇటీవల విడుదల చేశారు.
కేబుల్ బ్రిడ్జి సహా పనులు పూర్తి
మానేరు రివర్ ఫ్రంట్‌లో భాగంగానే ఎల్ఎమ్డి డ్యాం గేట్లకు దిగువ భాగాన కరీంనగర్ - వరంగల్ రహదారులను కలుపుతూ నదిపై రూ.180కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. మధ్యమధ్యలో చెక్డ్యాములూ నిర్మించారు. అయితే, ఇటీవలి వరదలకు అవి ధ్వంసం కావడంతో డిజైన్ మార్చి మళ్లీ నిర్మించేందుకు అవసరమైన డీపీఆర్‌ను సిద్ధం చేశారు.
ఇక కరీంనగర్ కమాన్ నుంచి కేబుల్‌బ్రిడ్జి వరకు రూ.40కోట్లతో రోడ్డు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణాలు సాగుతున్నాయి. రూ.7కోట్లతో కేబుల్ బ్రిడ్జి సమీపంలోనే సర్వీసు రోడ్డు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. మరో మూడు నెలల్లో రోడ్డు పనులు పూర్తి చేసి ఈ బ్రిడ్జిపై వాహనాలు నడిచేలా అనుమతి ఇవ్వనున్నారు. కరోనా కారణంగా రెండేండ్లు పనులు ముందుకు సాగలేదని, సంక్రాంతి అనంతరం టెండర్లు పిలిచి 20 నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
టెండర్లు పిలిచి పనులు వేగవంతం చేస్తాం
పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
పండుగ అనంతరం టెండర్లు పిలిచి రివర్‌ఫ్రంట్ పనులను వేగవంతం చేస్తాం. కరోనా కారణంగా కొన్ని పనులు ఆలస్యంగా సాగాయి. ఇప్పుడు ప్రభుత్వం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమకూర్చింది. మరో 20 నెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు చేపడుతాం. రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా కేంద్రం ఒక టూరిజం హబ్‌గా నిలవనుంది.