Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్రాంతి ముగ్గులతో టీచర్ల వినూత్న నిరసన
- 'ముఖ్యమంత్రి మాటే ముద్దు..దంపతులు విడిగా వద్దు'అంటూ రాతలు
- 'అన్‌బ్లాక్ 13 డిస్ట్రిక్స్ ఫర్ టీచర్స్' అంటూ ప్రదర్శనలు
- భార్యమో ఛత్తీస్‌గఢ్ బార్డర్లో.. భర్తమో కరీంనగర్ జిల్లా కేంద్రంలో..
- వందల కిలోమీటర్ల దూరానికి భార్యాభర్తల బదిలీలు
నవతెలంగాణ -కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇండ్ల ఎదుట శుక్రవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. 'వీ వాంట్ స్పౌజ్' అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్న భార్యాభర్తలు ముగ్గుల రూపంలో తమ డిమాండ్‌ను ప్రదర్శించారు. 'ముఖ్యమంత్రి మాటే ముద్దు.. దంపతులు విడిగా వద్దు' అంటూ సీఎం కేసీఆర్‌కు మొరపెట్టుకున్నారు. 317జీవో నేపథ్యంలో తలెత్తిన సమస్యలు.. ఆపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్లాక్ లిస్టులో పెట్టడం మూలంగా ఉమ్మడి జిల్లాలోనే వందల కిలోమీటర్ల వ్యత్యాసంలో భార్యాభర్తలు బదిలీ అయ్యారు. నవీన అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుమారు 180కిలోమీటర్ల దూరంలోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దు పలిమెల గ్రామానికి బదిలీ అయితే.. భర్తకేమో కరీంనగర్ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. ఇలా వందల సంఖ్యలో ఉన్న ఉమ్మడి జిల్లాలోని దంపతుల్లో సగానికిపైగా జంటలు వంద కిలోమీటర్ల వ్యత్యాసంలో బదిలీ కావడం గమనార్హం.
కరీంనగర్ జిల్లాకు చెందిన టీచర నవీనను జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెలకు బదిలీ చేశారు. ఆ గ్రామం ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకుని ఉంటుంది. ఆమె భర్తకు మాత్రం కరీంనగర్ జిల్లాలో పోస్టు అలాట్ చేశారు. ఇక్కడి నుంచి పలిమెలకు వెళ్లాలంటే 7గంటల సమయం పడుతుంది. బదిలీల్లో దగ్గరవుతామనుకున్న ఆ ఉపాధ్యాయుల జంటకు ఊహించని విధంగా పోస్టింగ్ రావడం తీవ్రంగా కలిచివేస్తోంది. భార్యాభర్తలు ఒకే చోట పని చేసే విధంగా పోస్టింగ్ అలాట్మెంట్ ఇవ్వాల్సిన సమయంలో రకరకాల సమస్యలు తలెత్తడంతో కరీంనగర్ జిల్లాను ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది.
గంట ప్రయాణం ఉన్నా ఒకే..
ప్రభుత్వ కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు, బదిలీలపై 317 జీవో ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఏర్పడుతున్న పలు సమస్యల రీత్యా ప్రభు త్వం రాష్ట్రంలోని 19 జిల్లాలను బ్లాక్ లిస్టులో పెట్టింది. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నాలుగు జిల్లాలూ ఉన్నాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లా లో భార్యాభర్తలుగా ఉన్న 329 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు స్పౌజ్ ఆప్షన్ కింద కాకుండా వేర్వేరు జిల్లాలకు బదిలీ అయ్యారు. అందులో సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట నుంచి భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం వరకు ఇలా వందల కిలోమీటర్ల దూరంలో బదిలీ అయింది. సాధారణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రాల మధ్య దూరం 40 నుంచి 45కిలోమీటర్ల మధ్య వ్యత్యాసమే ఉంటుంది. అయితే, ఈ నాలుగు జిల్లాల సరిహద్దులు మాత్రం వంద నుంచి 180కిలోమీటర్ల వరకూ ఉన్నాయి. బదిలీ ప్రక్రియ నాలుగు జిల్లాల పరిధిలో జరిగినా దూరం 50కి.మీ. మించి ఉండటం కారణంగా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసి తిరిగి ఇంటికి చేరడం కష్టంగా ఉంది. సాధారణంగా గంట ప్రయాణం ఉన్నా.. సర్దుకుని ఉద్యోగం చేసుకుంటామంటూ ఉపాధ్యాయులు వినూత్నంగా నిరసన తెలిపారు. బోగి పండుగ సందర్భంగా ఇండ్ల ఎదుట తమ డిమాండ్లను ముగ్గుల రూపంలో ప్రదర్శించారు.