Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిల్లర సంగతి అటుంచితే
- ఇంటికెళ్లి ఇస్తే.. మరింత అదనపు పైకం
- ప్రతి నెలా ఇదే తంతు
- ఆసరా పింఛన్ల పంపిణీలో చేతివాటం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పని చేయలేని వాళ్లు, ఒంటరి జీవులు, వృద్ధులు, వితంతువులు తదితరులు ప్రభుత్వం ఇచ్చే 'ఆసరా'తోటే నెలంతా గడపాలి.. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, మందులకు అవి ఎటూ సరిపోవు.. అయినా.. అందులోనూ పోస్టాఫీసు క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కార్యాలయానికి రాలేని వాళ్లకు ఇంటికెళ్లి ఆసరా పింఛన్లు ఇవ్వాలన్న సర్కార్ ఆదేశాలకు.. పైకం ఇవ్వందే పని చేయడం లేదు. చిల్లర దేవుడెరుగు.. ఇంటికొచ్చి ఇచ్చినందుకు అదనంగా వంద, రూ.50 ఇవ్వాల్సి వస్తోంది. అలాంటి వారిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ఆసరా పింఛన్లను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పోస్టాఫీసు నుంచి పంపిణీ చేస్తోంది. వాటిల్లో వృద్ధాప్య, చేనేత, గీత కార్మికులు, వితంతువు, ఒంటరి మహిళలకు ప్రతినెలా రూ.2016 అందజేస్తున్నారు. వికలాంగులకు రూ.3016 పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు 3,89,293మంది లబ్దిదారులున్నారు. దీనికిగాను సుమారు రూ.100కోట్లు వినియోగిస్తున్నారు. అందులో యాదాద్రి భువనగిరి జిల్లాలో 87739మంది లబ్దిదారులకు రూ.20.14కోట్లు, నల్లగొండ జిల్లాలో 1,75,351 మంది లబ్దిదారులకు రూ.41.29కోట్లు, సూర్యాపేట జిల్లాలో 1,26,203 మంది లబ్దిదారులకు రూ.30.59కోట్ల సొమ్ము ఖర్చు చేస్తున్నారు.
పింఛన్ ఇస్తే కమీషన్ ఇవ్వాల్సిందే..
ఆసరా పింఛన్ల సొమ్మును ప్రభుత్వం డీఆర్డీఏ సంస్థలో జమచేస్తోంది. ఆ సంస్థ పింఛన్ల సొమ్మును పోస్టాఫీస్‌కు బదిలీ చేసి, సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తుంది. సహజంగా లబ్దిదారులు పోస్టాఫీసుకు వెళ్లి పింఛన్లు తీసుకోవాల్సి ఉంది. లేదంటే గ్రామాలకెళ్లి ఇవ్వాలి. అక్కడికీ రాలేని, వృద్ధులు, వికలాంగులు, అంధులకు వారి ఇండ్ల వద్దకే వెళ్లి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయితే, ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తుంటే తమకు ''ఏం లేదా..'' అంటూ రూ.50 నుంచి 100 వరకు వసూలు చేస్తున్నారు. ఒకవేళ ఇవ్వలేదంటే వచ్చే నెల ఇంటికి రాకుండా రకరకాల కారణాలు చెపుతూ నిర్లక్ష్యం చేస్తుంటారు. సమయానికి పింఛన్ ఇవ్వరు.. ఎందుకొచ్చిన ఇబ్బందులంటూ.. అడిగినంత కమీషన్ లబ్దిదారులు ముట్టజెబుతున్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్, ఎస్ఎల్బీసీ ప్రాంతంలో పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది తమ నుంచి ప్రతి నెలా డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దామరచర్ల, చండూరు, చిట్యాల, కట్టంగూరు తదితర మండలాల్లోని కొందరు సిబ్బంది కమీషన్ పుచ్చుకోగా.. పై చిల్లర డబ్బులు కూడా ఇవ్వరని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'చిల్లర లేదు మేమేం చేయాలే అంటూ గద్దిస్తారని' లబ్దిదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి చోటా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. వీటిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని, పైగా ఫిర్యాదు చేసిన వారిని మానసికంగా వేదిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విచారణ చేసి చర్యలు తీసుకుంటా..
సత్యనారాయణ- ఫోస్టాఫీసు డివిజనల్ సూపరింటెండెంట్ నల్లగొండ
పింఛన్ లబ్దిదారులకు పంపిణీ చేసే సిబ్బంది డబ్బులు తీసుకుంటున్న విషయం తమ దృష్టికి రాలేదు. అయినా విచారణ చేయిస్తా.. తప్పులు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.