Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 317 జీవోపై కొనసాగుతున్న ఆందోళనలు
- పట్టువీడని ఉద్యోగులు, ఉపాధ్యాయులు
- మెట్టుదిగని ప్రభుత్వం
- ఒకే జిల్లాకు కేటాయించకపోవడంతో భార్యాభర్తల ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'నేను, మా ఆవిడ ఇద్దరం ఎస్జీటీలుగా పనిచేస్తున్నాం. నన్ను సిద్ధిపేట జిల్లాకు కేటాయించారు. మా ఆవిడను మెదక్ జిల్లాకు బదిలీ చేశారు. స్పౌజ్ బదిలీల కింద మా ఆవిడను సిద్ధిపేట జిల్లాకు కేటాయించాలని మెదక్ జిల్లా డీఈవోకు విజ్ఞప్తి చేశాం. అయినా స్పౌజ్ జాబితాలో మా పేరు లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం చుట్టూ రోజూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మానసికంగా కుంగిపోతున్నాం. మాకు న్యాయం చేయాలి'అని ఓ ఉపాధ్యాయుడు నాగరాజు చెప్పారు.ఇలాంటి ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాష్ట్రంలో 40 వేల మంది వరకు ఉంటారు. జిల్లా, జోన్, మల్టీ జోన్ మారిన వారు మానసికంగా ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 6న విడుదల చేసిన జీవోనెంబర్ 317లో స్థానికతను విస్మరించింది. సీనియార్టీ ఆధారంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపులను చేపట్టింది. దీంతో స్థానికతను కోల్పోయి వేరే జిల్లా, జోన్, మల్టీ జోన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ జీవోపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పట్టువీడడం లేదు. ఇటు ప్రభుత్వం మెట్టుదిగడం లేదు. ఎవరికి వారు తగ్గేదేలే... అన్న పరిస్థితి ఉన్నది. ఒకే జిల్లాకు భార్యాభర్తలను బదిలీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ వేర్వేరు జిల్లాలకు కేటాయించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీల పట్ల ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో భార్యాభర్తలుగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఒకే జిల్లాకు పంపించాలంటూ విద్యాశాఖతోపాటు వివిధ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించేందుకు ప్రగతిభవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు వారిని అరెస్టు చేశారు. వితంతువులు, ఒంటరి మహిళలు, అనారోగ్యంతో ఉన్నవారినీ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారు. దీనిపై బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. 317 జీవోను రద్దు చేయాలంటూ రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని ఈ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తొమ్మిది మంది బలి
రాష్ట్రంలో 22,418 మంది ఉపాధ్యాయులు, 13,760 మంది ఉద్యోగులు కలిపి మొత్తం 36,178 మంది ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. స్థానికతను వదిలి ఇతర జిల్లా, జోన్, మల్టీ జోన్‌కు వెళ్లడం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఈ సమస్య పాఠశాల విద్యాశాఖను కుదిపేస్తున్నది. వందల సంఖ్యలో పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి ఉపాధ్యాయులు వచ్చి సమస్య పరిష్కరించాలంటూ దరఖాస్తు చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులకు మొరపెట్టుకున్నా పరిష్కారం కావడం లేదు. దీంతో మనోవేదనకు గురవుతున్నారు. ఇంకోవైపు 317 జీవోకు ఇప్పటి వరకు తొమ్మిది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు బలయ్యారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చినముప్పారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జేత్రం నాయక్ ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. మహబూబాబాద్ నుంచి ఆయన్ను ములుగు జిల్లాకు కేటాయించడంతో తీవ్ర ఆందోళనకు గురై మరణించారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీశైలం సైతం రెండువారాల కింద గుండెపోటుతో చనిపోయారు. పనిఒత్తిడితోనే మరణించినట్టు ఇతర ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్రంలో 98 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను మల్టీ జోన్-1 నుంచి నుంచి 2కు, మల్టీ జోన్-2 నుంచి 1కి కేటాయించింది. కుటుంబాలను వదిలిపెట్టి స్థానికతకు దూరంగా వెళ్లడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జోక్యం చేసుకోవాలి : చావ రవి, టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని 317 జీవో వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించాలి. భార్యాభర్తలను ఒకే జిల్లాకు పంపించాలి. వితంతువులు, ఒంటరి మహిళ సమస్యలను పరిష్కరించాలి. స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల అప్పీళ్లను పరిష్కరించాలి.
హెచ్ఎంల మొదటి ఆప్షన్ ప్రకారమే కేటాయించాలి :
రాజభాను చంద్రప్రకాశ్, టీఎస్‌జీహెచ్‌ఎంఏ అధ్యక్షులు
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను మొదటి ఆప్షన్ ప్రకారమే కేటాయించాలి. వీలుకాకపోతే జీఏడీ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. సంగారెడ్డి జిల్లాలో 40 మంది హెచ్ఎంలను బదిలీ చేయడం సరైంది కాదు. రాష్ట్రంలో 1,802 గెజిటెడ్ హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.