Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్రాంతి కళను దూరం చేసిన కేంద్రం
- సబ్సిడీ ప్రకటించాక పెరుగుతున్న ధరలు
- డీఏపీని మించిన 'కాంప్లెక్స్' రేట్లు
- 100% పెరిగిన పొటాష్ ధరలు
- ఎకరానికి రైతుపై రూ.3,000 భారం
- రాష్ట్ర వ్యాప్తంగా రైతులపై రూ.4000 కోట్ల భారం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. రైతుల ఆదాయం పెంచ కపోగా వ్యవసాయ పెట్టుబడులు రెట్టింపు అయ్యాయి. ఇది చాలదన్నట్టు ఎరువుల ధరలు పెంచేసి రైతులకు సంక్రాంతి కళను దూరం చేసింది. దీంతో ఇటీవల కేంద్రం పెంచిన ధరలతో రాష్ట్రవ్యాప్త రైతాంగంపై ఏటా రూ.3,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల భారం పడనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు రూ.400 కోట్లకు పైగా ఎరువుల భారాన్ని భరిస్తున్నారు. ఒక్కో రైతు ఎకరానికి సుమారు 10 బస్తాల ఎరువులు వినియోగిస్తారు. ఈ లెక్కన బస్తాకు రూ.300 చొప్పున ఎకరానికి రూ.3000 భారం పడుతుంది. అంతర్జాతీయంగా యూరియా, డీఏపీ ముడిసరుకు ధరలు పెరగడం తో రైతులు ఎరువుల వినియోగం తగ్గించాలని కేంద్రం సూచిస్తోంది. ఈ రెండు ఎరువుల సబ్సిడీని భరిస్తూ మిగతా ఎరువుల భారాన్ని రైతులపై మోపుతోంది. దీనిలోనూ డీఏపీపై ఇటీవల బస్తాకు రూ.300 రేటు పెంచింది. రైతులు ఎక్కువగా వాడే 28.28.0 ఎరువు ధరలను 50%, పొటాష్ ధరను 100% పైగా 90 రోజుల్లోనే పెంచడం శోచనీయం. గత మార్చి నుంచి క్రమేణా ఎరువుల ధరలు పెరుగుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. కాంప్లెక్స్ ఎరువుల ధరల్లో భారీగా పెరుగుదల ఉంది. ఈ ఏడాదిలో ఒక్కో బస్తా ధర రూ.200 నుంచి రూ.800 వరకు పెరిగింది. అంతర్జాతీయంగా ముడి సరుకు ధరలు పెరగడం, డిమాండ్‌ను బట్టి కాకుండా సబ్సిడీని బట్టి కంపెనీలు ఎరువులను ఉత్పత్తి చేస్తుండటంతో రైతులపై భారం పడుతోంది. డీఏపీ రూ.1,100 నుంచి 1,580కి చేరింది. మార్చిలో రూ.1,350 ఉన్న పొటాష్ ధర డిసెంబరు నాటికి రూ.1,500కు చేరింది. ఇప్పుడు ఏకంగా రూ.1,750కి విక్రయిస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులు రూ.1,400 నుంచి రూ.1,900 వరకు ఉన్నాయి. ప్రభుత్వ సబ్సిడీ సరిపోవడం లేదనే కారణంతో కంపెనీలు ఉత్పత్తి తగ్గిస్తున్నాయి.
సబ్సిడీ ఇలా..
కంపెనీలు పెంచిన ధరలతో సంబంధం లేకుండా ఎరువుల్లో ఆయా పోషకాల శాతాన్ని బట్టి జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగానే సబ్సిడీ ఇస్తోంది. 2020- 21 బడ్జెట్లో కేంద్రం ఎరువులపై రూ.79,600 కోట్ల సబ్సిడీ ప్రకటించింది. 2021-22 బడ్జెట్లో రూ.60,000 కోట్లు మాత్రమే కేటాయించింది. దానిలోనూ వివిధ కారణాలతో రూ.55వేల కోట్లు మాత్రమే వెచ్చించింది. కిలో నత్రజనికి రూ.18.78, పాస్పరస్ రూ.45.32, పొటాష్ రూ. 1011, సల్ఫర్ రూ.7 చొప్పున కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. గతంలో ఉన్న 50 కేజీల డీఏపీ బస్తా ధరను కంపెనీలు రూ.1,280 రూ.1,900కు పెంచడంతో రూ.620 సబ్సిడీ ఇచ్చి ధర యథాతథంగా ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంది. కానీ మిగతా ఎరువుల ధరల విషయంలో ఈ రకమైన చర్యలు లేకపోవడంతో రైతులపై భారం పడుతోంది. మార్చి తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో టన్ను యూరియా ఉత్పత్తి ధర 260 డాలర్ల నుంచి 900 డాలర్లకు పెరిగింది. బస్తా యూరియాను ప్రభుత్వం రూ.3,750కి దిగుమతి చేసుకొని రూ.270కి రైతులకు విక్రయిస్తోంది. అంటే రూ.3,450 సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది. డీఏపీ విషయంలోనూ దాదాపు రూ.1,600 సబ్సిడీని ప్రభుత్వం రైతులకు ఇస్తోంది. గతంలో రూ.700 ఉన్న డీఏపీ సబ్సిడీని ఇప్పుడు 1,600కు పెంచింది. ఈ రెండు మినహా మిగతా ఎరువుల భారంలో అధికమొత్తం రైతులపై మోపుతోంది.
సబ్సిడీ ప్రకటించాక పెరుగుదల : పుల్లఖండం నాగేందర్ రావు- పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్
డీలర్స్ అసోసియేషన్- ఖమ్మం జిల్లా అధ్యక్షులు
కేంద్రం సబ్సిడీ ప్రకటించాక.. ఎరువుల ధరలు పెరుగుతుండటంతో రైతులపై భారం పడుతున్న మాట వాస్తవమే. దీనికితోడు రైతుల్లోని అవగాహన లోపం కారణం. ఏ కంపెనీ ఎరువైనా ఒకే పోషక విలువలుంటాయి. అదీ ప్రభుత్వం, ప్రయివేటు కంపెనీయా అనే నిమిత్తం లేదు. కొన్ని ప్రయివేటు కంపెనీల ఎరువు ధరలు అధికంగా ఉంటున్నాయి. కోరమాండల్ కంపెనీ ఈ కోవలోకే వస్తుంది. ప్రభుత్వరంగ కంపెనీ ఫ్యాక్ట్ ధర విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. డాలర్ రేటు పెంపు కూడా ఎరువుల ధరలపై ప్రభావం చూపుతుంది.
భారం కేంద్రమే భరించాలి : మాదినేని రమేష్- తెలంగాణ రైతు సంఘం- ఖమ్మం జిల్లా కార్యదర్శి
ఎరువుల ధరల భారం కేంద్రమే భరించాలి. కంపెనీలు దొడ్డి దారిలో ధరలు పెంచుతుంటే కేంద్రం చేష్టలుడిగి చూస్తోంది. ధరలపై కేంద్ర ప్రభుత్వానికి నియంత్రణ లేని ఫలితంగానే కంపెనీలు విచ్చలవిడిగా రేట్లు పెంచుతున్నాయి. పాత ధరల ప్రకారమే ఎరువులు అమ్మాలి. లేదా పెరిగిన ధరల సబ్సిడీని ప్రభుత్వం భరించాలి. ఈ ఏడాది బడ్జెట్లో రూ.15వేల కోట్ల ఎరువుల సబ్సిడీని తగ్గించారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న డీఏపీ విషయంలో ప్రభుత్వం సబ్సిడీ ఎలా పెంచిందో.. అత్యధికంగా వినియోగించే కాంప్లెక్స్ ఎరువుల విషయంలోనూ అలాగే సబ్సిడీని భరించాలి.
హామీ మరిచిన సీఎం కేసీఆర్ : రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతులకు ఉచితంగా ఎరువులు సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి విస్మరించారని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 2017 ఏప్రిల్ 13న ఈ ఉచిత హామీని ఇచ్చారని గుర్తుచేశారు. నాలుగేండ్లు గడిచినా ఇప్పటికీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకిచ్చిన హామీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ధరల పెరుగుదల ఇలా..
డీఏపీ, యూరియా మినహా మిగిలిన ఏ ఎరువైనా కంపెనీని బట్టి వ్యత్యాసం ఉంది. కొన్ని ప్రభుత్వ రంగ కంపెనీలు కూడా విచ్చలవిడిగా ధరలు పెంచుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రయివేటు కంపెనీలపై అసలు నియంత్రణే లేదు. ధరలకు అనుగుణంగా ప్రభుత్వం సబ్సిడీని పెంచే అవకాశం లేని నేపథ్యంలో రైతులే భారం భరించాల్సి వస్తోంది. 14:35:14, 28:28:0, 10:26:26 వంటి ఎరువుల ధరలను బస్తాపై రూ.1,400 నుంచి రూ.1,900 వరకు పెంచారు. 20:20:0:13 ఎరువు ధర రూ.1,125 నుంచి రూ.1,390కి పెంచారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరుగుతుండటంతో రైతులు డీఏపీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు డీఏపీ ఉత్పత్తిని తగ్గిస్తుండటంతో కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. కంపెనీ ఏదైనా పోషక విలువల్లో తేడా ఉండనప్పటికీ రైతులు సంప్రదాయంగా కొన్ని కంపెనీల ఎరువులనే విరివిగా వాడుతున్నారు. ఈ కారణంగా కూడా రైతులపై అదనపు భారం పడుతోంది. ఉదాహరణకు కోరమాండల్ కంటే ఇఫ్కో ఎరువుల ధరలు రూ.50 నుంచి తక్కువ ఉంటాయి. కానీ కొందరు రైతులు కోరమాండల్ కంపెనీ ఎరువులపై ఆసక్తి చూపుతున్నారు.