Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆత్మ గౌరవం
ధిక్కార స్వరం
తిరుగుబాటు పతాకం...
ధీశాలి చిట్యాల ఐలమ్మ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే సరిగ్గా సరిపోయే మాటలివి.
సంఘ చేతనం...
ఐక్య సమరం..
సుస్పష్ట లక్ష్యం...
పాలకుర్తి గురించి ప్రస్తావించాలంటే మదిపలికే పదాలివి.
ఇలా... ఐలమ్మ సాహసాన్ని-పాలకుర్తి ప్రస్థానాన్ని విడివిడిగా చూడటం సాధ్యంకాదు.
తెలంగాణ పేరును చరిత్రపుటల్లో శిలాక్షరాలుగా మార్చిన వీరతెలంగాణ సాయుధ సమరానికి సంఘ రూపం ఇచ్చిన... తొలి అడుగు జాడలు పాలకుర్తిలోనే పడ్డాయంటే ఆశ్చర్యం లేదు. అలాంటి పోరాటంలో ఒక మహిళ ధృవతారగా వెలిగిందనేది అతిశయోక్తి కాదు. వెలుగు, ఆనందాలకు ప్రతీకగా నేడు ఘనంగా జరుగుతున్న సంక్రాంతి సంబురాల్లోనైనా.... ఏ పండుగలోనైనా మహిళలే ప్రధాన భాగస్వాములు. ఈ సంతోషాలు నాడు లేవు. ఎందుకంటే పండగలైనా, చావులైన బానిసత్వంలోనే. అందుకే వీరతెలంగాణ తిరుగుబాటు, అందులోను మహిళల పాత్ర కీలకం. అందుకే సంక్రాంతి సంబురంలో ఐలమ్మ సాహసాన్ని నెమరేసుకుందాం.
చింతల చెరువు జాడలు.. నల్ల తుమ్మల నీడలు.. ఎత్తైన గడీ గోడలు. విస్నూరులో నేడు కనిపించే దృశ్యాలు ఇవే. కానీ... అక్కడి జాగీర్దారు అరాచకాలు, నాటి భూస్వామ్య పెత్తందారుల అకృత్యాలన్నిటికి అవి ప్రత్యక్ష సాక్ష్యాలు. అక్కడికి కేవలం మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న పాలకుర్తికి కేవలం ఈ ప్రత్యేకత మాత్రమే ఉంటే దొరగీసిన గీతల్లోనే ఉండేదేమో ఈ గ్రామం. కానీ 15వ శతాబ్దల్లోనే ప్రజాకవిగా పేరెళ్లిన పోతన ఊరు ''బమ్మెర'' సైతం ఇక్కడికి కేవలం మూడు కిలో మీటర్ల దూరంలోనే ఉండటం, కాకతీయుల యుగంలోనే గొప్ప విప్లవకవిగా వర్ధిల్లిన సోమనాధుని జన్మస్థలం కావడంవల్ల కాబోలు... ఇక్కడి ప్రజల్లో సహజంగానే అన్యాయంపై తిరుగుబాటుతత్వం ఉందేమో. కాకుంటే... 60 ఊర్లను శాశించే దొరకు కూత పెట్టు దూరంలో ఉండి, ఆచారాలు, కట్టుబాట్ల చట్రంలో కుమిలే సమయాన ఓ మహిళగా ఉండి, అర్ధాకలికి చిరునామాగా తోచే చాకలి కులంలో, పేదతనంలో ఉన్న వ్యక్తి ఐలమ్మ.... అగ్ని కణంలా లేచి, సంఘమై నిలవడం సాధారణ విషయం అసలేకాదు.
విస్నూరు దొర ఏలు బడిలోనే ఉన్న మల్లపల్లి ముఖ్తేదారు కొండల్రావుకు చెందిన, ఊరి చెరువుకింది భూమినే ఐలమ్మ కుటుంబం కౌలు చేసుకుంటూ జీవించేది. వెట్టిచాకిరి, దొరలు, నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ కార్యక్రమాలు విస్తరిస్తున్న కాలమది. 1944లో భువనగిరిలో జరిగిన సంఘం మహాసభల పిలుపులో ఉత్సాహంపొందిన పల్లెలు సంఘం నీడన సంఘటితమవుతున్నాయి. ఈ క్రమంలోనే పాలకుర్తిలోనూ ప్రజలు ఒక్కటి కాసాగారు. జీడి సోమయ్య నేతృత్వంలో ఆంధ్రమహాసభ శాఖ ఏర్పడింది. భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభకు సైతం ఆయన హాజరయ్యారు. సంఘం అండతో నిరక్షరాస్యులు చైతన్యవంతులయ్యారు. ఐలమ్మ తన ఇంటినే సంఘ కార్యక్రమాల కోసం ఇచ్చింది.
ఈ జన చైతన్యాన్ని దెబ్బకొట్టకపోతే ముప్పని భావించిన దొరలు... కొత్త ఎత్తులు వేయసాగారు. చాకలివృత్తి వద్దనుకుని ఆత్మగౌరవంతో బతకాలని భావించే చిట్యాల ఐలమ్మ, నర్సయ్య దంపతులతో పాటు, కొందరు దళితులు, దూదేకుల ఖాసీంలు ఏండ్లుగా సాగుచేసుకున్న భూమిని స్థానిక పూజారి వెంకట రమణకు ఇనామ్గా రాసిచ్చే కుట్రచేశారు దొరలు. వెంటనే విషయం తెలుసుకున్న జనం... ఇది సరైన పద్ధతికాదని పూజారిని హెచ్చరించగా... భూస్వాముల అండతో... స్థానిక పోలీస్ పటేల్ శేషగిరిరావు గూండాలను దింపి సంఘం కార్యలయంపై దాడికి యత్నించాడు. ప్రతివ్యూహంతో సిద్ధమైన సంఘం సభ్యులు.... వడిసెలలు, రాళ్లతో సమరానికి సై అనగా... గుండెలు జారిన గూండాలు పారిపోయారు. ఈ జన చైతన్యం సెగ విస్నూరు గడీని తాకింది. అనుచరులపై గర్రుమన్న... దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి... స్వయంగా రంగంలోకి దిగాడు. ఐలమ్మ, ఇతర పేదలు సాగుచేసుకునే భూమిలో కోతకొచ్చిన పంటను కోసుకురమ్మని మనుషులను పంపాడు. ఈ కుట్రలన్నిటిని ఎదుర్కొనేందుకు సిద్ధమై ఉన్న సంఘం నేతలు... ప్రజాదండును కూడగట్టారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతంలో పోరాటానికి నేతృత్వం వహించిన యోధుడు భీంరెడ్డి నర్సింహ్మారెడ్డి, చకిలం యాదగిరిరావు వంటి నేతలు స్వయంగా పాల్గొని ప్రజలకు ధైర్యాన్నిచ్చారు. దొర మనుషులను తన్ని తరిమారు. పంటను కాపాడి పేదల ఇళ్లకే చేర్చారు. మరో ఓటమితో కక్కలేని, మింగలేని పరిస్థితిలో పడ్డ విస్నూర్ దేశ్ముఖ్... నైజాం సాయంకోరి పోలీసుల్ని రంగంలోకి దింపారు. సంఘ నాయకుల్ని అడ్డుకున్న పోలీసులు కొంత ధాన్యాన్ని జప్తు చేయగా... అది తమ శ్రమ ఫలితమేనని ధైర్యంగా ముందుకొచ్చింది ఐలమ్మ. ఈ ఘటనను సాకుగా చూపి సంఘనేతలపై దొమ్మీ సహా అనేక కేసులు పెట్టి.. భీంరెడ్డి నర్సింహ్మారెడ్డి, చకిలం యాదగిరిరావు, శ్రీనివాసరావు, ఐలమ్మ, ఆమె భర్త, కొడుకుతో సహా పలువురిని జైలుకు పంపి చిత్రహింసలకు గురిచేశారు. ఇలా.... పాలకుర్తి పోరాటకేంద్రంగా మారిన నేపథ్యంలో... అనేకసార్లు భూస్వాములు చేయించిన దాడుల్లో... కుమ్మరి లక్ష్మీనర్సు, కన్నె బోయిన సోవయ్య, కొత్త శ్రీహరి వంటి వారు అమరులు కాగా... జీవం సోమయ్య వంటి సంఘ సభ్యుల్ని గడ్డివాములో వేసి సజీవంగా కాల్చి చంపిన దుర్మార్గాలు చోటు చేసుకున్నాయి.
దాడులు, హత్యలు.... కేసులు..... దొరలెన్ని వేషాలేసిన.... జన చైతన్యం పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. ఎర్రజెండా అండ ఉండటంతో... దొరల కుట్రలకూ తలొగ్గలేదు. సంఘమై, రణరంగానికి ఎప్పుడైనా సిద్ధమే అని నిలిచిన పాలకుర్తి ... పలు గ్రామాలకు వెలుగు దారిచూపిన కేంద్రమైంది. స్వాతంత్య్రానంతరమూ ఆ చైతన్యం కొనసాగింది. ఎన్నికల సమయంలోనూ సత్తా చాటుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో... రెండు దశాబ్దాలపాటు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది పాలకుర్తి. ప్రభుత్వంచే ఏడెనిమిది సార్లు ఉత్తమ గ్రామ పంచాయతీగా గుర్తించబడటమే.... అందుకు ఉదాహరణ. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారినా.... పోరు జెండానింపిన చైతన్యం ఆ గ్రామంలో నేటికి సజీవంగా ఉంది.
చెమట మాది.... చేను మాది....
పంట మాది... ఫలం మాది...
మా బతుకులపై మీ పెత్తనమేందీ!
అని దోపిడీ దొరలకు ఎదురు తిరిగి వీరవనితగా నిలిచిన మన ఐలమ్మ
మన పాలకుర్తి గడ్డ వీర తెలంగాణ పోరులో రాలని మోదుగు పూల కొమ్మ.