Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు
ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలు : ఏఐటీయూసీ
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్.బోస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికుల ఐక్యత చాలా అవసరమని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ నొక్కి చెప్పారు. హైదరాబాద్లో ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఏఐటీయూసీ జాతీయ సమావేశాలు నిర్వహించనున్నామని ప్రకటించారు. వాటిని పురస్కరించుకుని ప్రచార కార్యక్రమాలను ఆదివారం హైదరాబాద్లోని సత్యనారాయణరెడ్డి భవన్ వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులను సమీకరించడం, ఏకం చేయడం ఈ సమావేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలకు లబ్ది చేకూరే విధంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆర్థిక సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మికవర్గం కష్టపడి సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, భవిష్యత్ కర్తవ్యాలపై ఈ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహ్మ, జిల్లా అధ్యక్షులు కమతం యాదగిరి, నాయకులు బొడ్డుపల్లి కిషన్, రమేష్, లతీఫ్, ఒమర్ఖాన్, తదితరులు పాల్గొన్నారు.