Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాగులో ఈతకు వెళ్లి ఇరువురు మృతి
నవతెలంగాణ-అశ్వారావుపేట
పండుగ సరదా ప్రాణం తీసింది. వాగులో ఈతకు వెళ్ళిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో ఒకే ఊరిలో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, కొత్తమామిళ్ళ వారిగూడెంనకు చెందిన కవులూరి బజారు కుమారుడు సాయి(18), కొక్కెరపాటి స్వర్ణ కుమారుడు ప్రవీణ్ (16), మరో నలుగురు సిద్దెల సత్తిపండు, సిద్దెల కనకేష్, కాటూరి చిలకారావు, దూదిగం ఈశ్వర్లు ఆదివారం పండుగ కావడంతో సరదాగా ఈత కొడదామని అశ్వారావుపేట మండలం, దిబ్బగూడెం పంచాయతీ పరిధిలో గల గాడ్రాల వాగుకి వెళ్ళారు. ఈ క్రమంలో సాయి, ప్రవీణ్‌లు వాగులో ప్రమాదశాత్తు గల్లంతై మృత్యువాత పడ్డారు. వెంట ఉన్న యువకులు కొత్తమామిళ్ళవారిగూడె గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు వెళ్ళి గాలించారు. అప్పటికే మృతి చెంది ఉన్నారు. మృతదేహాలను గ్రామానికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్.ఐ రామ్మూర్తి గ్రామానికి వెళ్ళి వివరాలు సేకరించారు. మృతదేహాలను చిట్టితల్లి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఇంకా మృతుల కుటుంబాల నుండి ఫిర్యాదు అందలేదని తెలిపారు.