Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల పథకాలపై మంత్రి కేటీఆర్ శ్రద్ధ చూపాలి :
తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
మంత్రి కేటీఆర్కు పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ ఆఫీసుల నిర్మాణాలపై ఉన్న శ్రద్ధ కార్మికుల పథకాల నిర్మాణంపై లేదని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ అన్నారు. తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అనుబంధ రంగాల యూనియన్ కమిటీల నాయకుల బృందం సిరిసిల్లలో ప్రభుత్వం ప్రకటించిన వర్కర్ టూ ఓనర్ పథకానికి సంబంధించి నిర్మిస్తున్న వీవింగ్ పార్క్లో జరుగుతున్న వర్క్ షెడ్ల పనులను పరిశీలించింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడుతూ సిరిసిల్లలో పవర్లూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిన ఫలితంగా 2014లో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పవర్లూమ్ కార్మికులను యజమానులుగా మారుస్తూ ఒక్కో కార్మికునికి 4 సాంచేలు, వర్క్ షెడ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తామని వర్కర్ టూ ఓనర్ పథకాన్ని ప్రకటించారని అన్నారు. ఈ పథకానికి సంబంధించి పెద్దూరు శివారులో స్థలాన్ని కేటాయించి 2018 డిసెంబర్ 27న ముఖ్యమంత్రి కేసీఆర్ వీవింగ్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. శంకుస్థాపన చేసి 3 సంవత్సరాలు గడిచినా షెడ్ల నిర్మాణం పూర్తి కాలేదన్నారు. అటు ప్రభుత్వం.. ఇటు అధికారులు పట్టించుకోకపోవడంతోనే పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. పనులు ఈ విధంగానే కొనసాగితే ఇప్పట్లో కార్మికులను యజమానులుగా మారే పరిస్థితి లేదని అన్నారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరితగతిన వర్క్ షెడ్ల నిర్మాణాలను పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. లేకుంటే పవర్ లూమ్ కార్మికులందరితో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. వారివెంట పవర్లూమ్ వర్కర్స్ యూనియన్, వార్పిన్ వర్కర్స్ యూనియన్, వైపని వర్కర్స్ యూనియన్, టెక్స్టైల్ పార్క్ వర్కర్స్ యూనియన్, గార్మెంట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.