Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జైపాల్‌రెడ్డి ఘాట్ వద్ద రేవంత్,పలువురు నేత నివాళి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాజకీయాల్లో విలువలను కాపాడిన మహానేత కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. భౌతికంగా ఆయన లేకపోయినా, ఆయన సాధించిన రాష్ట్రంలో మనమున్నామని తెలిపారు. ఆదివారం నెక్లెస్‌రోడ్‌లోని జైపాల్‌రెడ్డి ఘాట్‌లో రేవంత్ దంపతులు, పలువురు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలకనుగుణంగా రాష్ట్రంలో పాలన జరగడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయన ఆశయాలు నెరవేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజకీయాలంటే పార్టీ ఫిరాయింపులు, కొనుగోళ్లు, కాంట్రాక్టులుగా అన్నట్టుగా తయారైందని విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి లేనిలోటు తీరనిదని మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్పారు. ఈనెల 24న మాజీ ఎంపీ డి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరుతారని వెల్లడించారు.