Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంచిర్యాల
మాంజాతో గొంతుకోసుకుపోయి వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం..పాత మంచిర్యాలకు చెందిన పస్తం భీమయ్య(40)కు ఇంటి వద్ద చేతి వేలికి చిన్న గాయం కావడంతో జిల్లా కేంద్రంలోని మ్యాదరివాడ సమీపంలో ఉన్న ఓ ఆర్ఎంపీ వైద్యుని వద్దకు చికిత్స నిమిత్తం భార్య శారదతో కలిసి టీవీఎస్ ఎస్ఎల్(లూనా)పై వచ్చాడు. తిరిగి వెళ్తుండగా పాత మంచిర్యాల బ్రిడ్జి సమీపంలో గాలిపటాలు ఎగరవేసే చైనా మాంజా మెడకు తగలడంతో కింద పడిపోయాడు. అప్పటికే 70శాతం మెడ భాగం తెగిపోయింది. గిలగిల కొట్టుకుంటున్న భర్తను చూసి భార్య బోరున విలపిస్తూ కాపాడుకునేందుకు ఆటోలో ప్రభుత్వ ఆస్పతికి తరలించింది. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించడంతో భార్య శారద రోదనలు మిన్నంటాయి. భీమయ్యకు కుమారుడు ప్రవీణ్, కూతురు అక్షయ ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఐ నారాయణనాయక్, ఎస్సైలు కిరణ్కుమార్, తైసినొద్దీన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజమడుగు గ్రామానికి చెందిన పస్తం భీమయ్య కుటుంబంతో మంచిర్యాలకు 35 సంవత్సరాల క్రితం వలస వచ్చి స్థానిక పాత మంచిర్యాలలో నివాసం ఉంటున్నాడు. అడ్డా కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు ఆదివారం ఉదయాన్నే జిల్లా కేంద్రంలో గాలిపటాలు, మాంజా దారం అమ్మే దుకాణాలపై ఆకస్మికంగా సోదాలు చేశారు. చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నారాయణనాయక్ హెచ్చరించారు.