Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19న కార్మిక, కర్షక ఐక్యత దినం :రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక
సంఘాల పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక చర్యలు, కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా ఈనెల 19న కార్మిక, కర్షక ఐక్యతాదినం పాటించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు పిలుపునిచ్చారు. జిల్లా, మండల కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించాలనీ, అందులో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు భాగస్వాములు కావాలని కోరారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో వారు విలేకర్లతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఏడాది రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఏడేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం లేదని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధరల చట్టం చేయాలనీ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. దేశంలోని రైతులందరికీ రుణాలు మాఫీ చేయకుండా కార్పొరేట్ల రుణాలు మాఫీ చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడమంటే, వాటిని ధనవంతులకు అప్పగించడమేనని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నదనీ, దానికి క్రమంగా నిధులు తగ్గిస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.