Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'స్థానికత'ను పరిగణనలోకి తీసుకోకే సమస్యలు
- రాష్ట్ర వ్యాప్తంగా 40వేల మంది ఇతర జిల్లాలకు కేటాయింపు,
- వీరిలో 22,000 మంది విద్యాశాఖ వారే...
- ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగులు నాలుగు జిల్లాలకు కేటాయింపు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రపతి నూతన ఉత్తర్వులకు అనుగుణంగా లోకల్ కేడర్లలో ఉద్యోగుల విభజన అత్యంత వివాదాస్పదంగా మారింది. సీనియారిటీ ఆధారంగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లో ఉద్యోగుల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా విడుదల చేసిన జీఓ 317పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికత ఆధారంగా ఏర్పడిన రాష్ట్రంలో దాని పునాదులనే ధ్వంసం చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 10 జిల్లాలను 2016 అక్టోబర్ 11న 31 జిల్లాలుగా పునర్విభజించి, జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జిల్లాల ఏర్పాటును అందరూ స్వాగతించినా జోనల్ వ్యవస్థ రద్దును పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిరసనల మధ్యే జిల్లా కార్యాలయాల్లోని ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ పేరిట కొత్త జిల్లాలకు కేటాయించారు. ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు పాఠశాల/ కార్యాలయం ఏ జిల్లా పరిధిలోకి వస్తే ఆ జిల్లా ఉద్యోగులుగా పరిగణించబడ్డారు.
విద్యాశాఖ ఉద్యోగులకు తీరని అన్యాయం
ఏకపక్షంగా డిసెంబర్ 6న విడుదల చేసిన జిఓ 317 ప్రకారం సీనియారిటీని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. కొద్దిమంది ప్రయోజనాల కోసం స్థానికత ఊసే లేకుండా ఉద్యోగుల కేటాయింపు చేశారన్న విమర్శలున్నాయి. అన్ని శాఖల్లో దాదాపు 40 వేలమంది, విద్యాశాఖలోనే 22,500 మందిని ఇతర జిల్లాలకు కేటాయించినట్టు ప్రాథమిక సమాచారం. సుమారు పది వేలమంది ఉపాధ్యాయులను తమ ఆప్షన్‌కు విరుద్ధంగా కేటాయించడంతో స్థానిక జిల్లాకు శాశ్వతంగా దూరమవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం నుంచి భద్రాద్రి కొత్తగూడెంకు 524, ములుగుకు 31, మహబూబాబాద్‌కు 88 మందిని కేటాయించారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఖమ్మానికి 466, మహబూబాబాద్ నుంచి 116, ములుగు నుంచి 03, మొత్తం 585 మందిని కేటాయించారు.
సీనియార్టీపై అభ్యంతరాలు
కొన్ని జిల్లాల్లో సీనియారిటీపై వచ్చిన అభ్యంతరాలను సవరించకుండానే ఫైనల్ చేసి అలొకేషన్ చేశారని ఆరోపిస్తున్నారు. మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సీనియారిటీ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని అత్యధికంగా పిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదని, స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ సరిగా పరిశీలించలేదని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. ఎస్సీ, ఎస్టీ దామాషా పాటించలేదని, స్థానిక భాషలనూ పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నాయి. ఏజెన్సీ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఉద్యోగులను వారి ఆప్షన్లకు భిన్నంగా మైదాన ప్రాంతం నిర్మల్, మంచిర్యాలకు కేటాయించడంపై అభ్యంతరాలు ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతం ములుగు జిల్లాకు మహబూబాబాద్ నుండి మైదాన ప్రాంత గిరిజనులను, మైదాన ప్రాంత గిరిజనులు ఉన్న మహబూబాబాద్ జిల్లాకు ములుగు జిల్లా ఆదివాసీలను కేటాయించడంపైన నిరసనలు తెలుపుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మైదాన ప్రాంత గిరిజనేతరులను, మైదాన ప్రాంత గిరిజనులను ఆదివాసీ ప్రాంతాలైన ములుగు, భద్రాద్రి జిల్లాలకు కేటాయించడంపైనా అభ్యంతరాలు వస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట ఏజెన్సీ ప్రాంత గిరిజనులను వారి ఆప్షన్ కు విరుద్ధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని అన్ని జిల్లాలకు, గిరిజనేతరులను అచ్చంపేట ప్రాంతానికి కేటాయించడంపై నిరసన వ్యక్తమవుతోంది. జిల్లాల్లో ఎస్సీ ఉ పాధ్యాయుల దామాషాను సక్రమంగా జిల్లాల అమలు చేయలేదని అంటున్నారు. స్పౌజ్, సీనియారిటీ, జిల్లాల కేటాయింపు పై కుప్పలు తెప్పలుగా అప్పీల్స్ వచ్చినా పట్టించుకోలేదని బాదిత ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.
జీఓలో పలు లోపాలు...
జీవోలు పలు లోపాలున్నాయి. స్థానికతను పరిగణించకపోవటం, దివ్యాంగుల వైకల్యం పర్సంటేజి 70శాతంగా నిర్ణయించటం, ఒక ఏరియాలో చేసిన మొత్తం సర్వీసును పరిగణనలోకి తీసుకోకపోవటం, కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ రంగ సంస్థల స్పౌజ్‌ల ప్రస్తావన లేకపోవటం, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపో వటం, మరికొన్ని దీర్ఘకాలిక జబ్బులను పరిగణనలోకి తీసుకోకపోవడం వంటి అనేక లోపాలున్నాయి. ఉపాధ్యాయుల నుండి ఒక్కరోజులో ఆప్షన్లు తీసుకు న్నారు. ఉపాధ్యాయుల బేసిక్ సీనియారిటీ జాబితాలు డీఈఓ కార్యాలయాల్లో లేనే లేవు. పాఠశాలల నుంచి వివరాలు తెప్పించి హడావుడిగా డ్రాఫ్ట్ లిస్టులు ప్రకటించారు. ఈ జీవో కారణంగా ఆయా జిల్లాల నిరుద్యోగుల్లో అసహనం ప్రబలి లోకల్ - నాన్ లోకల్ విభజనతో స్థానికేతరులను వారి స్వంత జిల్లాలకు పంపాలంటూ మరలా 610 లాంటి జీఓ కోసం ఒత్తిడి పెరగొచ్చు.
చావ రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి