Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం అధ్యక్షతన ...
- కరోనా కట్టడిపైనే ప్రధాన చర్చ!
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రిమండలి సోమవారం భేటీకానున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు క్యాబినెట్ సమావేశం ప్రారంభం కానున్నది. రాష్ట్రంలో పదిహేను రోజుల వ్యవధిలోనే 200 నుంచి రెట్టింపు అవుతూ 2500కు కరోనా కేసులు పెరిగిన విషయం విదితమే. ఈనేపథ్యంలో కరోనా అంశంపైనే మంత్రిమండలి ఎక్కువగా దృష్టిసారించే అవకాశముంది. ఆస్పత్రుల్లో బెడ్లను సమకూర్చుకోవడం, ఆక్సిజన్ సిలిండర్లు, పీపీ, టెస్టుల కిట్లు, మందులను అవసరం మేరకు అందుబాటులో ఉంచడం, వ్యాక్సినేషన్ రెండు డోసులను వేగంగా పూర్తి చేయడానికి ఏం చేయాలి? బూస్టర్ డోసులో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? అనేదానిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. పక్కరాష్ట్రాల్లో కరోనా నియంత్రణకు వారాంతంలో లాక్డౌన్లు, ప్రతిరోజూ నైట్ కర్ఫ్యూలను విధిస్తున్న విషయం తెలిసిందే. దీనిపైనా క్యాబినెట్ సమావేశం సమాలోచనలు చేసే ఆస్కారముంది. రాష్ట్రంలో ఒక బడులకు మాత్రమే సెలవులు ప్రకటించి..బార్లు, సినిమాహాళ్లు, మద్యం దుకాణాలు, మార్కెట్లను మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూరకుండా ఏ పద్ధతి అవలంభించాలనే విషయంపై దృష్టిసారించే అవకాశముంది. జీవో నెంబర్ 317 ప్రకారం ఉపాధ్యాయ, ఉద్యోగుల బదిలీలు చేపట్టిన విషయం విదితమే. సీనియార్టీనే ప్రాతిపదికన తీసుకోవడం, స్పౌస్, వికలాంగ కోటాల బదిలీల్లో అందరికీ న్యాయం జరగకపోవడం, బదిలీల వల్ల స్థానికతను కోల్పోవంటి అంశాలతో ఈ బదిలీలపై ఉపాధ్యాయ, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జీవో నెంబర్ 317పైనా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. తాజాగా దేశ, రాజకీయ రాజకీయాల్లో వస్తున్న మార్పులు, ఇటీవల వామపక్ష నేతలతో, తేజస్వీయాదవ్‌తో భేటీ సందర్భంగా వచ్చిన అంశాలనూ సీఎం కేసీఆర్ క్యాబినెట్‌కు వివరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. అదే సమయంలో మరోవైపు బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండటంతో బడ్జెట్ కూర్పుపైనా చర్చించే అవకాశముంది.