Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్షణాలు... నిమిషాలు..
ఘడియలు... గంటలు..
కాలం... గడుస్తనే ఉంది...
కసితీరా గర్జించేందుకు..
తుపాకీ ఎదురు చూస్తనే ఉంది
మోకజూసి ప్రజాసైన్యాన్ని మట్టుబెట్టాలని వాళ్లు..
డోకాబాజీ నిజాంసేనల పొతం పట్టాలని వీళ్లు...
దాదాపు తెల్లవారు జామునుంచి...
సీకటి రేకలు పారేదాకా...
సాగిన సయ్యాటకు ఇగ తెరబడ్డదబ్బ...
ధనాధన్ మని మోగింది తుపాకి దెబ్బ..
సాటుగా, మాటుగా.... వేటు వేసేందుకు... కొలను పాక తహసీల్దార్ చింతచెెట్టునుంచి పేల్చిన తుపాకీ తూట నేరుగా ఈ పోరుకు నేతృత్వం వహిస్తున్న చింతలపురి రామిరెడ్డికి తగిలింది. ''అదురొద్దు బెదరొద్దు పోరులో వెనకడు గొద్దని'' సహచరులకు సక్కి చెబుతూనే శత్రువుతో తలపడిన చింతలపురి రామిరెడ్డి... ధైర్యానికి నిలువెత్తు రూపం అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రేణికుంట సైతం నిజాం, రజాకార్లతో యమచెరలు పడ్డది. రైతువారి గ్రామంగా పేరున్న ఈ ఊరిలోని ప్రజలు చిత్రమైన శిస్తులు మోయలేని పన్నుల బాధతో అల్లాడారు. ఈ పల్లె చుట్టు ఉన్న పలు గ్రామాలపై పట్టు సాధించిన రజాకార్, నిజాం సైన్యానికి ఇక్కడ మాత్రం ఆ తావు దొరకలేదు. అది వారికి కంటగింపుగా మారింది రాజాపేటలో ఉన్న సైనిక క్యాంపు ద్వారా... రేణికుంటను తమ చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని చూసిన నిజాం కుట్రల్ని జనబలంతో తుత్తునీయలు చేశాడు చింతలపురి రామిరెడ్డి, వెట్టిచాకిరి, పన్ను పోటుకు వ్యతిరేకంగా... జనంపడే కష్టాలు కన్నీళ్లను చూసి ఆసామిగా ఉన్న రామిరెడ్డి... అందరినీ కూడగట్టాడు, ఆంధ్రమహాసభ విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రామంలో 50మందికి పైగా యువ కులతో... గ్రామరక్షక దళం ఏర్పాటు చేశాడు. వెట్టి చాకిరి రద్దును ప్రకటించుకున్న స్థానిక ప్రజలు పన్నుల పేర నిజాం రాజులు జరిపే అరాచకాల్ని అంతం చేయాలని... పిలుపునిచ్చారు. వీరందరికీ... నాయకుడిగా ఉన్నాడు రామిరెడ్డి. ఈ పరిణామాల్ని తీవ్రంగా పరిగణించిన రజాకార్లు, స్థానిక తహసీల్దార్, ఇతర అధికార్లతో వ్యూహలు రచించి... పలుమార్లు గ్రామంపై దాడులు చేశారు. అయినా బెదరలేదు జన సైన్యం గ్రామంలో శతృవు పాదం మోపనీయబోనని ప్రతినపునాడు చింతల పురి. అందుకే ఉద్యమ నేతలు ఆరుట్ల రామచెంద్రారెడ్డి పలుమార్లు ఇతర ప్రాంతాల్లో పని చేయాలని రామిరెడ్డికి సూచించినా గ్రామంపై ఉన్న ప్రేమతో అక్కడే ఉద్యమం కొనసాగించారు.
రేణికుంట జన రక్షణ కోటను చెల్లా చెదురు చేసే వ్యుహంతో అదనుకోసం వేచిచూస్తోంది నిజాంసేన... 1948 మార్చి 2 తెల్లవారు జామున అకస్మాత్తుగా ఎనిమిది లారీల్లో ఊరి పొలిమేరల్లో దిగిన నిజాం సైన్యం, రజాకర్లు, రిజర్వు పోలీసులు.... మరతుపాకులు, మిషన్గన్లు, భారీ ఆయుధాలతో ఊరిని చుట్టుముట్టారు. బుర్జుపై కాపలా ఉన్న గ్రామ రక్షక దళం సభ్యులు.... జనాన్ని అప్రమత్తం చేశారు. క్షణాల్లో ఒక్కచోట చేరిన ప్రజలు, దళసభ్యులు... వారి భారీ ఆయుధాల ముందు నిలువలేమన్నారు. తప్పు కోవడమే మేలన్నారు. గాండ్రించిన రామిరెడ్డి... పిరికితనం అస్సలేవద్దని... విజయమో, వీరస్వర్గమో పోరాటంలోనే తేల్చుకుం దామన్నాడు. దళ సభ్యులను తన మట్టి మిద్దెపైకి పిలిచాడు. వాళ్ల వద్ద కేవలం 15 తుపాకులే ఉన్నాయి. అయినా అదరక పోరుకు సైరను ఊదిన రామిరెడ్డి శత్రు వులపై విరుచుకు పడ్డాడు. మీసం తిప్పుతూ రోషం చూపుతూ ''రండిరా మీ అబ్బ, దెబ్బ దెబ్బకు అబ్బా! అనాలంటూ'' కదనోత్సాహం, మొండి ధైర్యం ప్రదర్శించాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం గడిచేవరకు 40 మంది శత్రు సైనికులు నేలరాలారు. నాలుగు వందల మందికి పైగా సైన్యం ఉన్నా రామిరెడ్డి దళం చేతిలో చావు దెబ్బతినడాన్ని కొలనుపాక తహసీల్ధార్ నాసర్అలీ భరించలేక పోయాడు. ఆగ్రహంతో రగిలిన అతనికి పక్కనే ఉన్న చింతచెట్టు మొదలు కనిపించింది. ఆయుధంతో స్వయంగా ఆ చెట్టు వెనకకు వెళ్లి నక్కాడు. ఇలాంటి ప్రమాదం ఉంటుందని ఊహించిన చింతలపురి.. గ్రామ శివార్లలోని చెట్లన్నిటిని గతంలోనే నరికించాడు. శత్రువుల రాక గమనించి అప్రమత్తమయ్యేందుకు ఈ పని చేసినా... గ్రామంలోని భారీ చింతచెట్టు కొమ్మలు తప్ప మొదలునరకలేక వదిలేశారు. ఇప్పుడు దాన్నె అదునుగా వాడుకున్న తహసీల్దార్ పిల్లిలెక్క నక్కినక్కి ఆ చెట్టు ఎక్కాడు డాబామీద ఉన్న రాంరెడ్డికి నేరుగా గురి పెట్టి కాల్చాడు ఈ దొంగ దెబ్బతో దళం పట్టు తప్పింది. శత్రువు చెజిక్కి ప్రాణాలొదిలే తరుణమే వస్తే.... ఆత్మార్పణమే మేలని తలచిన రాంరెడ్డి.... గాయంతోనే... వాయు వేగంతో ఆలోచిస్తున్నాడు. మందుగుండు అయిపోయినా తమ ఆయుధాలు నైజాంసేనకు చిక్కొద్దనుకొని ... ధ్వంసం చేశాడు. దళంలో ఉన్న తన కొడుకు రంగారెడ్డిని కాల్చిచంపి... తనను తాను కాల్చుకుని జనంకోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించాడు.
ఆయన మరణానంతరం... నిజాం సేన... దాబపై ఉన్న 27మంది దళ సభ్యుల్ని మయమాటలతో కిందికి రప్పించి... అతిదారుణంగా కాల్చి చంపింది. అనంతరం గ్రామంలో ఇండ్లను ధ్వంసం చేసి దొరికిన వారిని దొరికినట్టు చంపి... శవాలన్నిటినీ లారీల్లో వేసుకుని... గ్రామానికి మొత్తం నిప్పుపెట్టి వెళ్లిపోయింది. తమ వద్ద ఉన్న శవాలన్నిటినీ ఊరిచివర ఉన్న సొప్పాములవేసి తగుల బెట్టి ఊరు విడిచిపోయింది. ఈ దాడితో అడవిలోకి పారిపోయిన పిల్లా జెల్లా, కొందరు ప్రజలు... అడవిలోకి పారిపోయిన కొందరు ప్రజలు వల్లకాడులా మారిన గ్రామంలోకి ఆరు నెలలపాటు రాలేదు. ఇంతటి కౄరమైన దాడులను సైతం ఎదిరించి నిలబడ్డ రేణికుంట జనం ఆ తరువాత కూడా రణరంగంలో జనచైతన్యాన్ని ప్రదర్శించింది. పలు గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది.
నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా నిలిచిన ఆ గ్రామంలో భూమిలేని ప్రతికుటుంబానికి కనీసం పదిగుంటల చొప్పున పంచిన సంఘం నేతలు, వెట్టిచాకిరికి విముక్తి కల్పించడం వంటి అభ్యుదయ చర్యల ప్రభావం స్వాతంత్రనంతరమూ కొనసాగింది. ఇప్పటికీ ఆ చరిత్ర స్ఫూర్తినింపుతూనే వుంది.
సొంత ఊరిపై అమితమైన ప్రేమ..
ప్రజలకోసం ప్రాణమిచ్చే సాహసం..
ఆపదొస్తే ఆత్మగౌరవాన్ని చాటే ధీరత్వం..
రేణికుంటను, చింతలపురి రాంరెడ్డిని
చరిత్రలో చిరస్ధాయిగా వేగుచుక్కగా నిలిపాయి.