Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతా రాములు పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తుర్కయాంజల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులు, కళాకారులతో కూడిన బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ నేడున్న సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో ఈ నెల 22 నుంచి 25 వరకు నాలుగు రోజుల పాటు తుర్కయాంజల్లో జరిగే సీపీఐ (ఎం) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. ఇప్పటికే మహాసభల ఏర్పాట్లు అత్యంత జయప్రదంగా సాగుతున్నాయని తెలిపారు. మూడేండ్లకోసారి జరిగే సీపీఐ(ఎం) మహాసభల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పరిస్థితులపై ప్రధానమైన చర్చలు జరుగుతాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన వాగ్ధానాలు, అనుసరిస్తున్న విధానాలపై పార్టీ నాయకత్వం పెద్ద ఎత్తున చర్చించి పోరాటాలకు ప్రజల్ని మరోమారు సిద్ధం చేసేందుకే ఈ బస్సుయాత్రను ప్రారంభిస్తు న్నామని వివరించారు.
ఈ ప్రచార యాత్ర నేటి నుంచి వారం రోజుల పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థాయిలో అన్ని గ్రామాల్లో పర్యటించి పాలకవర్గాల విధానాలను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. అంతే కాకుండా ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో పాటు జిల్లాలో ఉన్న స్థానిక సమస్యలను ఈ మహాసభల్లో చర్చించి ప్రజా ఉద్యమాలపై భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని వెల్లడించారు. అలాగే పార్టీ నిర్మాణం, ప్రజాపునాధిని విస్తరించేందుకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో చర్చించనున్నామని అన్నారు.
కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య, బి.సామెల్, ఎం. చంద్రమోహన్, డి.జగదీష్ జి.కవిత, జిల్లా కమిటీ సభ్యులు డి.కిషన్, ఇ.నర్సింహా, ఏ. నర్సింహా, కె.జగన్, గోరెంకల నర్సింహా, తులసీగారి నర్సింహా, ఐ.భాస్కర్, కె.శంకర్, కె.శ్రీరామ్ మూర్తి, బి.శంకరయ్య, కె.వెంకటకృష్ణ, డి.శ్రీధర్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జె వినోద్ కుమార్, జి గణేష్, ప్రకాష్ కారత్, బి.శంకర్, కె.సత్యం, రవిందర్ రావ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.