Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ రాష్ట్రసర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నెంబర్ 4ని జారీ చేసింది. మెడికల్ కాలేజీలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలోనే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించినట్లు తెలిపారు.
పాఠశాలలకు సెలవుల పొడిగింపు సమంజసం కాదు : టీఎస్‌యూటీఎఫ్
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల విద్యాసంస్థలకు జనవరి 30 వరకు సెలవులు ప్రకటించటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావరవి ఒక ప్రకటనలో ఖండించారు. పాఠశాలలు సెప్టెంబర్ ఒకటోతేదీనే ప్రారంభం అయ్యాయనీ, 50 శాతం సిలబస్ కూడా పూర్తికాలేదని పేర్కొన్నారు. ఆన్లైన్ విద్య విద్యార్థులందరికీ అందుబాటులో లేదని తెలిపారు. రెండేండ్లుగా ప్రత్యక్ష బోధన సాగలేదనీ, పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేశారని పేర్కొన్నారు. ఫలితంగా విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు కూడా కొరవడినాయని తెలిపారు. రాష్ట్రంలో సామూహిక, సామాజిక, వ్యాపార కార్యకలాపాలన్నీ అన్నీ యధావిధిగా నడుస్తున్నాయని వివరించారు. వాటన్నింటినీ వదిలి విద్యాసంస్థలనే మూసేయటం ఏంటని ప్రశ్నించారు. ప్రత్యక్ష తరగతులు కొనసాగించకపోతే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పాఠశాలలు తెరవాలని డిమాండ్ చేశారు.
బార్లు, క్లబ్బులు, మాల్స్‌ను వదిలి బడులకే ఎందుకిలా? : ట్రస్మా
కోవిడ్ వ్యాప్తికి ప్రధాన కేంద్రాలుగా ఉన్న మార్కెట్లు, సినిమాహాళ్లు, షాపింగ్‌మాల్స్, బార్లు, మద్యం దుకాణాలు, పార్టీల సమావేశాలను వదిలేసి విద్యాసంస్థలకు మాత్రమే సెలవులు ప్రకటించడం ఏమిటని ట్రస్మా నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ట్రస్మా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదగిరి శేఖర్‌రావు, సాధుల మధుసూధన్, కోశాధికారి ఐవీ రమణారావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పిల్లల చదువు బంద్పెట్టడం చాలా అన్యాయమని పేర్కొన్నారు.
సెలవులు పొడిగింపు సరిగాదు : డీటీఎఫ్
విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించడం సరికాదని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.రఘుశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే విద్యావ్యవస్థ గాడిన పడుతున్న నేపథ్యంలో మళ్ళీ పాఠశాలలకు సెలవులు ప్రకటించడం విద్యావ్యవస్థకు నష్టదాయకమని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా సెలవులు ప్రకటించడం సరిగాదని పేర్కొన్నారు.