Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్సీఆర్ఐ విద్యార్థులకు రిజర్వేషన్లు
- ఫారెస్టు యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం :
క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటవీశాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద భర్తీ చేసే పోస్టుల్లో ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎఫ్సీఆర్ఐ)లో నాలుగేండ్ల డిగ్రీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు రిజర్వేషన్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఫారెస్టు యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది. సోమవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశం ఈ నిర్ణయాలను తీసుకున్నది. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్)విభాగంలోని ఉద్యోగాల్లో 25 శాతం రిజర్వేషన్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(ఎఫ్ఆర్ఓ) ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు, ''ఫారెస్టర్స్'' విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు ప్రకటించింది. అందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ సర్వీస్ రూల్స్ (1997), తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ (2000)లలో సవరణలు చేపట్టాలని నిర్ణయించింది. ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక సమాచారంతో కూడిన నివేదికను అటవీశాఖ అధికారులు మంత్రిమండలికి అందజేశారు. వచ్చే సమావేశం నాటికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను క్యాబినెట్ ఆదేశించింది.