Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంఠేశ్వర్
రెవెన్యూ అధికారుల తప్పిదాలు బాధితుల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. పెద్ద ఎత్తున మామూళ్లు పుచ్చుకొని రికార్డులను తారు మారు చేసి బాధితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఓ దంపతులు నిజామాబాద్ కలెక్టరేట్ లో సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బోధన్ మండలంలోని ఆచన్పల్లికి చెందిన దర్శనం బంధయ్య, రాణి దంపతులు.. పాండుతర్పాలో 30 ఏండ్ల కిందట రెండెకరాల భూమిని కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన కొత్త పట్టాలపై భూమి విక్రయించిన వారి పేర్ల మీద రావడంతో కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో అమ్మిన వారు మళ్లీ కబ్జాకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ కుటుంబం తమపై దాడులు చేస్తూ, తాము పండించిన పంటను దౌర్జన్యంగా కోసుకుపోతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల కారణంగా తమ భూమిపై హక్కు లేకుండా పోయిందంటూ వాపోయారు. దాంతో ప్రజావాణికి వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అక్కడున్న వారు, పోలీసులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కోరారు.