Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవోనెంబర్ 4ను రద్దు చేయాలి
- కరోనా నిబంధనలతో కొనసాగించాలి :ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయనే నెపంతో విద్యాసంస్థలకు ఈనెల 30 వరకు సెలవులు పొడిగించడం సరైంది కాదని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ విమర్శించింది. జీవోనెంబర్ 4ను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని కోరింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయనే పేరుతో విద్యాసంస్థలకు సెలవులివ్వడమంటే విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడమేనని తెలిపారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల్లోనూ విద్యాసంస్థలను మూసివేయలేదని గుర్తు చేశారు. ఏపీలోనూ విద్యాసంస్థల్లో తరగతులు నడుస్తున్నాయని వివరించారు. ఇప్పటికే 21 నెలలుగా విద్యార్థులు తమ చదువులు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. ఇప్పుడు ఆన్లైన్ చదువులంటే సామాజికంగా, ఆర్థికంగా నష్టపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాప్‌టాప్, ట్యాబ్‌లు కొనలేని స్థితి తల్లిదండ్రుల్లో ఉందని పేర్కొన్నారు. ఇంటర్నెట్ ఛార్జీలు పెరగడంతో వారికి భారంగా మారిందని తెలిపారు. ఆన్లైన్ చదువుల వల్ల ఎలాంటి ఫలితాలుంటాయో చూశామనీ, ఇంటర్లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారని వివరించారు. ఆన్లైన్ చదువులతో విద్యార్థులకు నష్టమని పేర్కొన్నారు. రవాణా వ్యవస్థ, మాల్స్, వైన్‌షాపులు, థియేటర్లు, రెస్టారెంట్లు, రాజకీయ పార్టీల ర్యాలీలు, పండుగలకు లేని ఆంక్షలు విద్యాసంస్థలకే ఎందుకని ప్రశ్నించారు. దీనివల్ల ఒక తరం నష్టపోతుందని తెలిపారు. కరోనా తీవ్రత ఎక్కువుంటే ప్రాథమిక పాఠశాలలకు సెలవులిచ్చి మిగతా విద్యాసంస్థలను షిఫ్ట్ పద్ధతిలో నడపాలని కోరారు. ప్రభుత్వం అన్ని విద్యాసంస్థల్లోనూ వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలల్లో షిఫ్ట్ పద్ధతిలో తరగతులు నిర్వహించాలని సూచించారు. హైస్కూలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో శానిటేషన్ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.