Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ బయానాపత్రంతో ఉన్న కాస్త జాగాను లాక్కున్నరు :
- సీతంపేట బాధిత దళితుడి ఆ'వేదన'
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
తన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని కాజేశారని, కోర్టు స్టే ఇచ్చినా అధికార అండదండలతో ఆ భూమిని సాగు చేసుకుంటున్నారని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దళితుడు గుండ్ల కుమారస్వామి ఆ'వేదన' వ్యక్తం చేశారు. 'నవతెలంగాణ'కు ఓ లేఖ ద్వారా తన గోడు వెల్లబోసుకున్నాడు. 1974న తన తండ్రి, పెద్దనాన్న ఇద్దరూ కలిసి రూ.1500 ఖరీదుతో 2 ఎకరాల 20గుంటల భూమిని సాదాబైనామా కింద కొనుగోలు చేసి ఇన్నేండ్లుగా సాగుచేసుకుంటూ వచ్చారని తెలిపాడు. తన పెద్దనాన్న వాటానూ తన తండ్రి రూ.50వేలు ఖరీదు చేసి కొనుగోలు చేశారని చెప్పాడు. అలా 2011 వరకూ వికలాంగుడైన తన తండ్రి సాగుచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడన్నారు. ఈ క్రమంలో ఆయనకు అరోగ్యం సహకరించకపోవడంతో గ్రామంలోని చిలుక సురేష్‌కు కౌలుకు ఇచ్చాడని పేర్కొన్నాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ భూమిని తనకు అమ్మినట్టు తన తండ్రిపేరుతో ఓ నకిలీ బయానా పత్రం సృష్టించిన సురేష్ ఆ భూమిపై రికార్డుల్లో అసలు పట్టాదారులుగా ఉన్న సీహెచ్ వీరయ్య వారసులతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని తెలిపారు. విషయం తెలుసుకున్న తాము హుజూరాబాద్ సబ్‌కోర్డు ద్వారా దావా వేసి కొట్లాడగా కోర్టు సైతం తమకు అనుకూలంగా స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చిందని, కోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే అండదండలతో తమకున్న కాస్త భూమిని కబ్జా చేశారని వాపోయాడు. తమ వెనక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉన్నాడంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని, ప్రభుత్వం స్పందించి తగు విచారణ చేసి, న్యాయంగా తమకు రావాల్సిన భూమిని తమకు ఇప్పించాలని కోరాడు.