Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవిష్యత్తులో స్థానికంగా సినిమా షూటింగ్ : సినీ దర్శకులు పైడిపెల్లి వంశీ
నవతెలంగాణ-ఖానాపూర్‌టౌన్
తాను పుట్టి పెరిగిన ఊరును ఎన్నటికీ మరువలేనని సినిమా దర్శకులు పైడిపెల్లి వంశీ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వస్థలమైన నిర్మల్ జిల్లా ఖానాపూర్ వచ్చిన ఆయన తన నివాసంలో సోమవారం విలేఖరులతో మాట్లాడారు. చిన్నప్పుడు చదివిన బడి, చిన్ననాటి ఆటలు, తిరిగిన వీధులు ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తుకు వస్తాయని తెలిపారు. సినిమా రంగంలో ఈ స్థాయిలో ఎదగడానికి సొంతూరు ప్రజల ఆశీర్వాదాలేనన్నారు. రైతు నేపథ్యంతో తీసిన మహర్షి సినిమాకు జాతీయ స్థాయి అవార్డు రావటంలో పొందిన ఆనందం కంటే ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులే ఎంతో గొప్పవని తెలిపారు. ఇక్కడి ప్రజల కోరిక మేరకు భవిష్యత్‌లో తప్పకుండా ఖానాపూర్ ప్రాంతంలో సినిమా షూటింగ్ చేస్తామని చెప్పారు. తాను దర్శకత్వం వహించిన మహర్షి సినిమాకు ఆ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఊహించలేదన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించటం గొప్ప అనుభూతిని కల్గించిందన్నారు. కష్టానికి గుర్తింపు లభించినప్పుడు బాధ్యత మరింత పెరుగుతుందని తెలిపారు. ఎన్నో ఏండ్ల నుంచి ఖానాపూర్ ప్రాంత ప్రజలకు వినోదాన్ని పంచి ఇక్కడి ప్రజల్లో తమ కుటుంబానికి గౌరవం తెచ్చిన తమ లక్ష్మీ సినిమా థియేటర్‌ను కూల్చివేయటం బాధగా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో తప్పలేదని తెలిపారు. సినీ రంగంలో కళాకారులు బయటకు కనిపించినంత సంబరంగా ఉండరని, వాళ్లకు ఎన్నో కష్టాలుంటాయని తెలిపారు. ఎంతో మంది పేదలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారని చెప్పారు. ప్రభుత్వాలు ఆ దిశలో యోచిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు సన్మానించారు. మీడియా సమావేశంలో వంశీ తండ్రి రవీందర్రావు, నాయకులు తనుగుల రమేష్, సురేష్, బీసీ రమేష్, పెద్ది సాయి, శేఖర్‌రావు, సాడాగె లక్ష్మణ్, బీసీ రాజన్న ఉన్నారు.