Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 214 కేజీల గంజాయి విలువ రూ. 70లక్షలు
- రూ.2 లక్షలు, మూడు కార్లు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం
- పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు
- మీడియాకు వివరాలు వెల్లడించిన డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ-కొత్తూర్
రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ చౌరస్తా వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు, కొత్తూర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో ఆదివారం మధ్యరాత్రి పక్కా సమాచారం మేరకు దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 214 కిలోల గంజాయి, మూడు కార్లు, రూ. 2.10లక్షల నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ ఎస్ఓటీ సీఐ వెంకట్‌రెడ్డి, కొత్తూర్ సీఐ శ్రీధర్ భూపాల్, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి గంజాయి తరలిస్తున్న వారిని పట్టుకున్నారు. విశాఖ జిల్లా సీలేరు నుంచి సరుకును మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. వరంగల్ జిల్లాకు చెందిన రవి, నల్గొండ జిల్లాకు చెందిన నాగరాజు, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలానికి చెందిన వినోద్ మధ్యవర్తుల ద్వారా విశాఖ జిల్లా సీలేరు నుంచి గంజాయిని తరలిస్తూ.. కొత్తూర్ మండల పరిధిలోని తిమ్మపూర్ చౌరస్తా వద్ద కారులోకి సరుకు మారుస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ. 70లక్షలు ఉంటుందని తెలిపారు. మధ్యవర్తులుగా వ్యవహరించిన మరో ఇద్దరు రవి, నాగరాజులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. యువత డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా దూరంగా ఉండాలని డీసీపీ తెలిపారు. మత్తు పదార్థాలు, గంజాయి తరలింపుపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిపారు. గంజాయి ముఠాను పట్టుకున్న శంషాబాద్ ఎస్ఓటీ సీఐ వెంకట్ రెడ్డి, కొత్తూరు సీఐ శ్రీధర్ భూపాల్, వారి బృందాన్ని డీసీపీ అభినందించారు. సైబరాబాద్ సీపీ ద్వారా వీరికి రివార్డులు ప్రకటించనున్నట్టు తెలిపారు. మీడియా సమావేశంలో షాద్‌నగర్ ఏసీపీ కుషాల్కర్, కొత్తూరు సీఐ, శంషాబాద్ ఎస్ఓటీ సీఐ, ఎస్ఐ రవి, ఏఎస్ఐ వేణుగోపాల్, హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.